తితిదేలో అక్రమాల చిట్టా సిద్ధం!

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ అధికారులు తమ పరిశీలనను ముగించారు.

Published : 29 Jun 2024 06:14 IST

తితిదేలో అన్ని అంశాలపై విజిలెన్స్‌ ఆరా 
టెండర్ల పైనా కూపీ లాగిన అధికారులు 

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ అధికారులు తమ పరిశీలనను ముగించారు. ఇప్పటికే పలు విభాగాల్లో కీలక పత్రాలను సేకరించారు. కంప్యూటర్లలోని హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత అవకతవకలను గుర్తించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని హార్డ్‌డిస్క్‌లు మాయమైనట్లుగా గుర్తించినట్లు సమాచారం. తితిదేలో ప్రధానంగా శ్రీవాణి ట్రస్టు టికెట్ల పైనా తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటి నిధుల వినియోగంపై విజిలెన్స్‌ అధికారులు సుదీర్ఘంగా పరిశీలించారు. ఒక్కో టికెట్‌కు రూ. 10,500 చొప్పున వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో తితిదే ఖాతాకు కేవలం రూ.500 మాత్రమే చేరగా, మిగిలిన రూ.10 వేలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. అలాగే తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక అధికారులతో పాటు ముఖ్య సలహాదారులు, పలు విభాగాల అధిపతులు దర్శనాల పేరుతో సాగించిన అక్రమాల తాలూకు చిట్టా విజిలెన్స్‌ చేతికి చిక్కినట్లు తెలిసింది.

దాతల విరాళాల్లో వ్యత్యాసాలు..

డొనేషన్ల రూపంలో శ్రీవారికి ఆభరణాల వితరణ తదితర అంశాలపై విజిలెన్స్‌ విభాగం క్షుణ్నంగా పరిశీలించగా, దాతలు ఇచ్చిన వివరాలకు, లెక్కల్లో చూపుతున్న వివరాలకు తేడాలున్నట్లుగా తేలింది. తితిదే ఇంజినీరింగ్‌ విభాగంలో ఐదేళ్ల కాలంలో జరిగిన టెండర్లు నిర్మాణ పనులు మరమ్మతుల అంశాల్లో చోటుచేసుకున్న అవినీతిపై ఇప్పటికే ఓ లెక్క తెలినట్లు తెలుస్తోంది. నామినేషన్ల పద్ధతిలో కొన్ని నిర్మాణ పనులను కొందరు పెద్దలకు కట్టబెట్టినట్లు కూడా సమాచారం. తితిదే ఉద్యోగుల స్థలాల కోసం భూముల కొనుగోలులో జరిగిన భారీ అవినీతి దందాను కూడా విజిలెన్స్‌ విభాగం ఛేదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని