వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు.

Updated : 29 Jun 2024 06:36 IST

విద్యాదీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.3,480 కోట్లు 
ఉన్నత విద్య సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘న్యాయ వివాదాలను పరిష్కరించి, వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. విశ్వవిద్యాలయాల రేటింగ్‌ పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక బదిలీలు పారదర్శకంగా జరగాలి. గత పదేళ్లల్లో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల వివరాలపై నివేదిక ఇవ్వాలి. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసి, వివరాలు సమర్పించాలి. కళాశాలలకు నేరుగా చెల్లించే బోధన రుసుముల పథకాన్ని తొలగించి గత ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. విద్యాదీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం రూ.3,480కోట్ల మేర బకాయిలు పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయాయి. ఆయా విద్యా సంస్థలతో మాట్లాడి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడానికి చర్యలు తీసుకోవాలి’ అని అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీలో నిర్వహించాల్సిన పరీక్షల వివరాలపైనా ఈ సమీక్షలో చర్చించారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల మెరుగుకు కరిక్యులమ్‌లో మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ప్రవేశాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధుల వినియోగం తదితర అంశాలపై సమావేశంలో మంత్రి చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని