బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు కోసం నోటిఫికేషన్లు

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) చట్టం జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అందులోని వివిధ సెక్షన్ల కింద పోలీసులకు అధికారాలను దఖలుపరుస్తూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది.

Published : 29 Jun 2024 06:06 IST

సీఆర్‌పీసీ స్థానంలో జులై 1 నుంచి భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత

ఈనాడు, అమరావతి: క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) చట్టం జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అందులోని వివిధ సెక్షన్ల కింద పోలీసులకు అధికారాలను దఖలుపరుస్తూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది. సెక్షన్‌ 37 ప్రకారం అరెస్టయినవారి పేర్లు, వారి చిరునామాలు, ఏ నేరాభియోగంపై వారు అరెస్టయ్యారనే సమాచార సేకరణ, ఆ రికార్డుల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారిని, ప్రతి పోలీసుస్టేషన్‌లో ఏఎస్సై హోదా కంటే తక్కువ కాని అధికారిని నియమించుకునేలా నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో పోలీసు కంట్రోల్‌ రూమ్‌లను నోటిఫై చేసింది. దృశ్యమాధ్యమ విధానం ద్వారా సాక్షులను విచారించేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిలో హైకోర్టు అనుమతితో నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్‌ గదులను నోటిఫై చేసింది. నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లుగా నియమించేందుకు అధికారమిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు అధికారులు, సిబ్బందికి బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టాల్లోని అంశాల ప్రకారం అధికారాలు ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని