సర్వే పేరుతో రూ.110 కోట్ల దారిమళ్లింపు

గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌)ని వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. గత ఐదేళ్లలో డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు వినియోగించాల్సిన నిధుల్ని విచ్చలవిడిగా దారి మళ్లించింది.

Published : 28 Jun 2024 05:41 IST

అదంతా సెర్ప్‌లో ఖర్చుపెట్టాల్సిన సొమ్ము
వైకాపా అధికారంలోకి రాగానే తెరమీదకు ‘వై క్రియేటర్స్‌ మీడియా’ 
డ్వాక్రా మహిళల ఉపాధికి వెచ్చించాల్సిన నిధుల దుర్వినియోగం
ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి

ఈనాడు, అమరావతి: గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌)ని వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. గత ఐదేళ్లలో డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు వినియోగించాల్సిన నిధుల్ని విచ్చలవిడిగా దారి మళ్లించింది. రూ.2,100 కోట్ల అభయహస్తం నిధులు, రూ.1000 కోట్ల స్త్రీనిధి నిధుల్ని పక్కదారి పట్టించిన జగన్‌ అంతటితో ఆగకుండా ప్రజాభిప్రాయ సేకరణ కోసమంటూ దాదాపు మరో రూ.110 కోట్లను దుర్వినియోగం చేశారు. వైకాపా సోషల్‌ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతకు చెందిన సన్నిహితుని కంపెనీ అయిన ‘వై క్రియేటర్స్‌ మీడియా ఎల్‌ఎల్‌పీ’కి ఈ మొత్తాన్ని కట్టబెట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నట్టు సమాచారం. దీనిపై విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

ప్రతి నెలా సర్వేనే....

సాధారణంగా ఏ సర్వే సంస్థ అయినా మూడు నెలలకో....ఆరు నెలలకో లేదా ఎన్నికల సమయంలోనో సర్వే చేయడం సాధారణంగా జరుగుతుంది. విచిత్రమేమంటే వైకాపా ప్రభుత్వం ఈ సంస్థతో నెల నెలా సర్వే చేయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రతి నెలా జీతభత్యాల కింద చెల్లించినట్టు దాదాపు రెండు కోట్ల మేర విడుదల చేశారు. సెర్ప్‌ పరిధిలో రెగ్యులర్‌గా పనిచేసే ఉద్యోగులకు 3, 4 నెలలకొకసారి జీతాలు చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సర్వే సంస్థకు మాత్రం ఠంఛనుగా వారి కోటా నిధులు ప్రతి నెలా విడుదల చేసే వారు. దీన్ని బట్టే ఇది వైకాపా నేతలకు ఎంత ప్రాధాన్యమున్న సంస్థనో ఇట్టే అర్థమవుతుంది. పోనీ ఆ సంస్థ సర్వే చేసిన వివరాలేమైనా సెర్ప్‌కు అందిస్తుందా అంటే అదీ లేదు. చాలా వరకు అన్ని వివరాలు గోప్యమే. మొదట్లో కొంతమేర ఏవో బుక్‌లెట్‌లు అందించినా...ఆ తర్వాత చాలా పథకాలకు సంబంధించి అదీ లేదు. గత ఐదేళ్లూ సెర్ప్‌ సీఈవోగా వ్యవహరించిన అధికారలందరూ వైకాపాకు వంతపాడినవారే. అందుకే ఎక్కడా అడ్డు అనేది చెప్పకుండా డ్వాక్రా మహిళల ఉపాధికి వెచ్చించాల్సిన నిధుల్ని వైకాపా సేవకు వెచ్చించారు. ఎన్నికల ముందు కూడా ఆ కంపెనీకి నిధులు విడుదల చేశారు. ఆ పార్టీ సేవలో తరించారు. అంతా ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లోనే....

2019లో వైకాపా అధికారంలోకి ఇలా వచ్చిందో...లేదో హైదరాబాద్‌కు చెందిన వై క్రియేటర్స్‌ సంస్థను తెరమీదకు తెచ్చారు. సర్వే పరంగానూ ఈ సంస్థకు పెద్ద అనుభవం లేదు. రియల్‌ ఎస్టేట్‌కు చెందిన ఆ కంపెనీని పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమంటూ తెచ్చారు. నవరత్నాలతోపాటు ఇతర అన్ని శాఖల్లోని పథకాలపై అభిప్రాయాన్ని తెలుసుకునేందుకంటూ తీసుకొచ్చారు. ఇలా ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించిందో లేదో...ఒప్పందం, ఇతరత్రా అన్ని వ్యవహారాలూ చకచకా జరిగిపోయాయి. నిధులు మాత్రం సెర్ప్‌ నుంచి కేటాయించారు. ఏడాదికి రూ.20 కోట్ల వరకు ఇందుకు ఖర్చు చేయడం గమనార్హం. ఈ కంపెనీకి నిధుల చెల్లింపులో జాప్యం లేకుండా ఉండేందుకు ఏటా ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించారు. నిధులు విడుదల చేసే సెర్ప్‌ అధికారులకు ఆ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే చేస్తుందో లేదో...ఏఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే చేస్తుందో.. ఏదీ తెలిసేది కాదు. అంతా సీఎంవో పర్యవేక్షణలోనే జరిగినట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని