తితిదేలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

తితిదే నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని తిరుమల తొలి పర్యటన సందర్భంగా స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దానికి అనుగుణంగానే చర్యలు ప్రారంభించారు.

Published : 28 Jun 2024 05:41 IST

పలు అంశాలపై వివరాల సేకరణ
‘శ్రీవాణి’ మొదలు పనుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి

ఈనాడు, తిరుపతి: తితిదే నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని తిరుమల తొలి పర్యటన సందర్భంగా స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దానికి అనుగుణంగానే చర్యలు ప్రారంభించారు. తొలుత ఈవో ధర్మారెడ్డిని సాగనంపి.. ఆపై వైకాపా హయాంలో చేసిన ఖర్చులతోపాటు టికెట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు  ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి తితిదేలోని పలు విభాగాల్లో రాష్ట్రస్థాయి విజిలెన్స్‌ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

ఐదు అంశాలపై దృష్టిపెట్టిన విజిలెన్స్‌

రాష్ట్రస్థాయి విజిలెన్స్‌ అధికారులు తితిదే ఆర్జిత సేవా, వీఐపీ బ్రేక్‌ టికెట్ల కేటాయింపు, వివిధ టెండర్లు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, గదుల ఆధునికీకరణ/అతిథిగృహాల కేటాయింపు, అగరబత్తీల తయారీ.. ఇలా పలు అంశాలపై  ప్రత్యేక దృష్టి పెట్టారు. శ్రీవాణి ట్రస్టుపైనే వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ‘శ్రీవాణి’ ద్వారా వచ్చిన డబ్బును పక్కదారి పట్టించారనే విమర్శలున్నాయి. మరోవైపు వైకాపా ఐదేళ్ల పాలనలో ఎస్‌ఎంజీహెచ్, ఎస్‌వీసీ, వరాహస్వామి అతిథిగృహం, టీబీసీ, ఏఎన్‌సీ, నారాయణగిరితోపాటు పలు కాటేజీల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందులో పలు కాటేజీల పనులను కడపకు చెందిన గుత్తేదారులకు అప్పగించారు. దీనిపైనా విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. గోవిందరాజస్వామి సత్రాలను కూల్చివేసి రూ.460 కోట్ల వ్యయంతో అచ్యుతం, శ్రీపథం అతిథిగృహాలను నిర్మించనున్నారు. నాడు వైకాపా తీసుకొచ్చిన కాటేజీ డొనేషన్‌ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గడువు ముగిసిన కాటేజీలను మళ్లీ వేలం ద్వారా మరొకరికి ఎలా కట్టబెట్టారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. అన్నదానం, లడ్డూ తయారీకి ఏ విధంగా పదార్థాలను సేకరిస్తున్నారనే విషయాన్ని చూశారు. పరిశీలించిన అంశాలపై విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని