పారిశుద్ధ్యం.. భద్రత.. ఓ కుంభకోణం!

బోధనాసుపత్రుల్లో జోన్ల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు గత వైకాపా ప్రభుత్వం పిలిచిన టెండర్‌ను కొత్త ప్రభుత్వం రద్దుచేసింది. కొత్తగా మరోసారి టెండరు పిలవనుంది.

Published : 28 Jun 2024 05:40 IST

ఆసుపత్రుల్లో సిబ్బంది రాకపోయినా భారీగా మార్కులు
వాటి ఆధారంగానే వారికి చెల్లింపులు
గత ప్రభుత్వం పిలిచిన టెండర్‌ రద్దు

ఈనాడు, అమరావతి: బోధనాసుపత్రుల్లో జోన్ల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు గత వైకాపా ప్రభుత్వం పిలిచిన టెండర్‌ను కొత్త ప్రభుత్వం రద్దుచేసింది. కొత్తగా మరోసారి టెండరు పిలవనుంది. బోధనాసుపత్రుల్లో భద్రత, పారిశుద్ధ్యం, ఎలుకల నివారణ లాంటి పనుల్లో వైకాపా పాలనలో చాలా పెద్ద కుంభకోణమే చోటుచేసుకుంది. ఈ మూడు అంశాలకు వైకాపా పాలనలో టెండర్ల ద్వారా ఎంపికచేసిన సంస్థలు 2021 జూన్‌ 1 నుంచి బాధ్యతలు చేపట్టాయి. మూడేళ్ల కాలపరిమితి ఈ ఏడాది మే 31తో ముగిసింది. వీటి అక్రమాలను మరో ఏడాది పొడిగించేలా వైకాపా హయాంలో గట్టి ప్రయత్నాలే జరిగినా, అధికారులు 3 నెలలకే పొడిగింపు ఇచ్చారు. పారిశుద్ధ్య పనులకు గత ప్రభుత్వం పిలిచిన టెండర్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ రద్దుచేశారు. ఈ మూడు రకాల పనులకు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చుపెడుతోంది. నిత్యం రద్దీగా ఉండే బోధనాసుపత్రుల్లో పారిశుద్ధ్యం, భద్రత, ఎలుకల నివారణ పనులు సక్రమంగా జరగడంలేదు. మరోవైపు.. ఈ సంస్థల పనితీరు, బిల్లుల చెల్లింపులను పరిశీలించే అధికారులు, సిబ్బందిలో చాలామందికి నెలవారీ ముడుపులు అందుతున్నాయి. టెండర్లు పొందినవారి తరఫున సబ్‌కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలను నిశితంగా గమనించి, ఉల్లంఘనలకు తగ్గట్లు చర్యలు తీసుకోవాల్సిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఉదాసీనంగా వ్యవహరించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 హాజరు కాకున్నా మార్కుల వరద

డీఎంఈ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 23 బోధనాసుపత్రులు, ప్రత్యేక ఆసుపత్రులు ఉన్నాయి. రోజూ వార్డులు, ఫ్లోర్లను మూడు సార్లు, ఆపరేషన్‌ థియేటర్లను ఐదుసార్లు శుభ్రం చేస్తేనే దుర్వాసన రాకుండా ఉంటుంది. దీన్ని పరిశీలించేవారు లేరు. తిరుపతి రుయాలో గతేడాది పారిశుద్ధ్య విభాగంలో 76% మందే హాజరైనట్లు నమోదుకాగా.. 98 మార్కులు వేశారు. కడప జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం, భద్రతా విభాగాల్లో 76.01%, 68.11% మంది చొప్పున విధులకు హాజరైతే... 96 చొప్పున మార్కులు ఇచ్చారు. విశాఖ కేజీహెచ్‌లో భద్రత, ఎలుకల నివారణ విభాగంలో ఉద్యోగుల హాజరు (ఆగస్టు) 80-85% మధ్యన ఉండగా ప్రాధాన్య మార్కులు 96 వరకు వచ్చాయి. ఈ మార్కుల ఆధారంగానే వారికి చెల్లింపులు ఉంటాయి. కాకినాడ జీజీహెచ్‌లో నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా ఉంది.

 భద్రతా విభాగంలో మహిళలే ఎక్కువ

భద్రతా విభాగంలో నిబంధనల ఉల్లంఘనలు మరీ దారుణంగా ఉన్నాయి. గార్డుల్లో ఎక్కువమంది మహిళలు ఉంటున్నారు. 30 పడకలకు మొదటి షిఫ్టులో ఇద్దరు, రెండో షిఫ్టులో ఒకరు, మూడో షిఫ్టులో ఒకరి చొప్పున ఉండాలి. పారిశుద్ధ్య పనివారు ప్రతి పది పడకలకు ఒకరు (ఫస్ట్‌ షిఫ్ట్‌), 20 పడకలకు ఒకరు (రెండో షిఫ్ట్‌), 30 పడకలకు ఒకరు (మూడో షిఫ్ట్‌) విధుల్లో ఉండాలి. కేజీహెచ్‌ వంటి పెద్దాసుపత్రుల్లో కనీసం 200 మంది విధుల్లో ఉండాలి. కానీ తగిన సంఖ్యలో వీరిని నియమించడం లేదు. తక్కువ మందిని నియమించి, ఎక్కువ మందిని నియమించినట్లు చూపించి డబ్బు కొట్టేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపుగా ఏ ఆసుపత్రిలోనూ నిబంధనల మేరకు సిబ్బంది విధుల్లో ఉండడంలేదు. ఈ మొత్తం వ్యవహారాలపై తగిన విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని