సెప్టెంబరు 21 నాటికి అన్న క్యాంటీన్లు

సెప్టెంబరు 21 నాటికి రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్న క్యాంటీన్లూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.

Published : 28 Jun 2024 05:38 IST

మంత్రి నారాయణ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: సెప్టెంబరు 21 నాటికి రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్న క్యాంటీన్లూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో కలిసి ఆ శాఖలోని వివిధ విభాగాలపై సమీక్ష నిర్వహించారు. ‘గతంలో నిర్మాణం పూర్తయి చిన్న చిన్న మరమ్మతులున్న 183, నిర్మాణాలు పూర్తి కావలసిన మరో 20 అన్న క్యాంటీన్ల భవనాల పూర్తికి అంచనాలు సిద్ధం చేయాలి. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలి. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, డెవలపర్లు విధిగా నిబంధనలు పాటించేలా చూడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలి. భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలి’ అని అధికారులను మంత్రి ఆదేశించారు.

క్లోరినేషన్‌ తర్వాతే నీటి సరఫరా 

సరైన క్లోరినేషన్‌ తర్వాతే తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని మంత్రి సూచించారు. నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో లేఅవుట్ల అనుమతుల విషయంలో వస్తున్న ఫిర్యాదులపై కమిటీ వేయాలని నారాయణ నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని