65.18 లక్షల మందికి రూ.4,399 కోట్ల పింఛన్లు

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జులై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు.

Published : 28 Jun 2024 05:36 IST

జులై 1వ తేదీన ఇంటి వద్దే పంపిణీ
కలెక్టర్లకు సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జులై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. సాధ్యమైనంత మేరకు ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి రెండో రోజు అందించాలని పేర్కొన్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘పెంచిన పింఛన్ల మేరకు 65.18 లక్షల మందికి రూ.4,399.89 కోట్ల వ్యయం కానుంది. ఇందులో 64.75 లక్షల మంది పింఛనుదారులకు ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలి. మిగతా 43 వేల మంది బయటి రాష్ట్రాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులు. వీరికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఇళ్ల వద్ద పంపిణీ చేసే మొత్తాన్ని 29వ తేదీనే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగికి 50 పింఛన్లను అప్పగించాలి. అందుకు సంబంధించిన లబ్ధిదారుల వివరాల మ్యాపింగ్‌ను 28 నాటికే పూర్తి చేయాలి’ అని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని