నీటి నమూనాలు పరీక్షించకుంటే చర్యలు తప్పవు

నీటి నమూనాల నాణ్యత నిర్ధారణ పరీక్షలను సక్రమంగా చేయని సీహెచ్‌ఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ హెచ్చరించారు.

Published : 28 Jun 2024 05:35 IST

ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ 

ఈనాడు, అమరావతి: నీటి నమూనాల నాణ్యత నిర్ధారణ పరీక్షలను సక్రమంగా చేయని సీహెచ్‌ఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ హెచ్చరించారు. డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల్లోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం మంగళగిరిలోని ప్రధాన కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘జులై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్టాప్‌ డయేరియా ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. కాలానుగుణ, కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెరిగేలా చూడాలి. ఈ కేంద్రాలకు గర్భిణులు వచ్చేలా క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ చూపాలి. దీనికి తగ్గట్టు వైద్యులు అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్‌ పద్మావతి, అదనపు సంచాలకుడు అనిల్‌కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎస్పీఎంగా శ్రీనివాసరావు: జాతీయ ఆరోగ్య మిషన్‌ స్టేట్‌ ప్రాజెక్టు మేనేజర్‌గా ఎం.శ్రీనివాసరావును (అదనపు బాధ్యతలు) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం నియమించింది. ఈయన వైద్య ఆరోగ్య శాఖ నియామకాల కోసం ఏర్పాటైన బోర్డుకు సభ్య కార్యదర్శిగా కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని