విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి అవార్డు

విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అవార్డు లభించింది.

Published : 27 Jun 2024 06:11 IST

దేశంలోనే రికార్డుస్థాయిలో ఏటా 3.75 లక్షల మందికి జారీ

విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న శివహర్ష  

ఈనాడు, అమరావతి: విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అవార్డు లభించింది. జూన్‌ 24న దిల్లీలో జరిగిన పాస్‌పోర్టు సేవా దివస్‌ కార్యక్రమంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ చేతుల మీదుగా అవార్డును విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శివహర్ష అందుకున్నారు. విజయవాడలో బుధవారం  విలేకరుల సమావేశంలో శివహర్ష ఈ విషయం తెలిపారు. 2023-24లో రికార్డుస్థాయిలో 3.75 లక్షల పాస్‌పోర్టులను జారీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. దేశంలోని 37 పాస్‌పోర్టు రీజియన్‌ కార్యాలయాల పరిధిలో అంతకుముందు ఏడాది కంటే 15 శాతం అధికంగా జారీ చేయగా, విజయవాడలో 20 శాతం దాటడం గొప్ప విషయమని శివహర్ష తెలిపారు. 13 పోస్టాఫీసు సేవాకేంద్రాలు, విజయవాడ, తిరుపతిలోని పాస్‌పోర్టు కార్యాలయాల ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత  కేవలం రెండు మూడు రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 600 మందికి సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలోనే సేవలను విస్తరించడం ద్వారా రోజుకు 1,200 మందికి పెంచనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని