డ్రగ్స్, గంజాయి రక్కసి కోరలు పీకాల్సిందే

జగన్‌ జమానాలో మాదక ద్రవ్యాలకు, గంజాయికి కేంద్రంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది.

Updated : 27 Jun 2024 06:45 IST

జగన్‌ జమానాలో ఊరూరా లభ్యత 
సాగు, రవాణా, విక్రయం వరకూ అష్టదిగ్బంధం చేయాలి 
ఆ దిశగా బహుముఖ వ్యూహం అమలు చేయాలి 

ఈనాడు, అమరావతి: జగన్‌ జమానాలో మాదక ద్రవ్యాలకు, గంజాయికి కేంద్రంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. ఊరూరా వేళ్లూనుకుపోయిన ఈ రక్కసి కోరలు పీకేందుకు పటిష్ఠ కార్యాచరణ అమలుచేయాలి. ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం... సాగు నుంచి రవాణా, విక్రయం వరకూ ప్రతి దశలోనూ అష్టదిగ్బంధం చేస్తేనే గంజాయి లభ్యత, వినియోగం తగ్గుతాయి. ఆ మేరకు బహుముఖ వ్యూహం రూపొందించాలి. ఏఓబీలో ఇప్పటికీ వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. దాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి. దీనికోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటుచేయాలి. ఒడిశాలోని మల్కన్‌గిరి, గజపతి, గంజాం తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి ఏపీలోకి వచ్చేస్తోంది. ఆయా మార్గాలన్నింటినీ గుర్తించి తనిఖీలు ముమ్మరం చేసి వాటికి అడ్డుకట్ట వేయాలి. గంజాయి స్థావరాలపై దాడులు చేయాలి. ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి.. విస్తృత తనిఖీలు జరపాలి.

టీఎస్‌ న్యాబ్‌ తరహా విభాగాలు అవసరం

గంజాయి, మాదకద్రవ్యాల కట్టడి కోసం అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో తెలంగాణలో యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌)ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. అది మంచి ఫలితాలిచ్చింది. గోవా తదితర రాష్ట్రాలకు వెళ్లి ఆపరేషన్లు నిర్వహించి డ్రగ్స్‌ ముఠాల సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఈ తరహా విభాగాల్ని ఏర్పాటుచేయాలి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ తరహాలో ఈ విభాగాల్ని సిద్ధం చేయాలి.

విద్యాసంస్థల్లో డ్రగ్‌ పెడలర్స్‌ను గుర్తించాలి

వైకాపా హయాంలో అన్ని స్థాయుల విద్యాసంస్థల్లోకి గంజాయి వ్యాపించింది. దీన్ని అరికట్టే కార్యాచరణలో కొత్త ప్రభుత్వం విద్యాసంస్థలను భాగస్వాముల్ని చేయాలి. కళాశాలల్లో అంతర్గత తనిఖీలు, నిశిత పరిశీలనలు చేయించాలి. విద్యార్థులపై వ్యక్తిగత పర్యవేక్షణ పెంచాలి. డ్రగ్‌ పెడలర్స్‌గా మారిన విద్యార్థులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలి. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, బానిసలు.. తమ జీవితాల్ని నాశనం చేసుకున్న తీరుపై అవగాహన సదస్సులు నిర్వహించాలి.

వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటుచేయాలి

రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల బానిసల సంఖ్య వేలల్లో ఉంది. వారిని ఆ విష వలయం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తగినన్ని వ్యసన విముక్తి కేంద్రాలు లేవు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యసన విముక్తి, పునరావాస కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలి.


గంజాయి సరఫరా, వినియోగంపై అధ్యయనం జరగాలి

  • రాష్ట్రంలో ఒకప్పుడు మద్యం మత్తులో ఎక్కువగా తీవ్ర, హింసాత్మక నేరాలు జరిగేవి. కానీ గత ఐదేళ్లలో గంజాయి మత్తులో జరిగిన దారుణాలే అత్యధికం. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం రాష్ట్రంలో ఎంత ఉద్ధృతంగా ఉందనే దానిపై సమగ్ర అధ్యయనం చేయించాలి. అమెరికాలో మాదకద్రవ్యాల బారిన పడి ఒక వ్యక్తి చనిపోతే అందుకు గల కారణాలపై చాలా మేధోమథనం జరుగుతుంది. మన దగ్గర కూడా ఆ స్థాయిలో అధ్యయనం జరగాలి. దాని ఆధారంగా కట్టడికి పటిష్ఠ కార్యాచరణ రూపొందించాలి. 
  • డ్రగ్స్, గంజాయి రవాణా, వినియోగంపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటుచేయాలి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఇది బాగా పనిచేసినా గత వైకాపా ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. మళ్లీ కొత్త నంబరును సిద్ధం చేసి.. విస్తృత ప్రచారం కల్పించాలి. 
  • సీఐడీలోని నార్కొటిక్స్‌ విభాగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. దాన్ని మళ్లీ క్రియాశీలకం చేసి.. మత్తు ముఠాల ఆటకట్టించాలి.
  • రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలపై నిఘాపెట్టాలి. వాటి వెనకనున్న కింగ్‌పిన్‌ల ఆచూకీ కనిపెట్టాలి. గంజాయి స్మగ్లర్ల ఆస్తులు జప్తుచేయాలి.

పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తేనే...

  • జగన్‌ పాలనలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ మన్యంలోనే బయటపడేవి. గంజాయి సాగు, రవాణాను అరికట్టకుండా వదిలేయడంతో మత్తుముఠాలు పేట్రేగిపోయాయి. వాటికి ముకుతాడు వేయాలి.
  • మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు చెందిన మత్తు ముఠాలు గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నాయి. మన్యంలో అలాంటి ముఠాలపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలి.
  • గంజాయి విక్రేతలను గుర్తించేందుకు ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి వారిపై చర్యలు తీసుకోవాలి. అలాంటివారిపై పీడీ యాక్ట్‌ తెరవాలి.
  • విశాఖ మన్యం నుంచి విదేశాల వరకూ గంజాయి మాఫియా కోరలు చాచింది. పోలీసులు కొరియర్లపైనే కేసులు పెడుతున్నారు. ఆ నెట్‌వర్క్‌ను ఛేదించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు