నేటి వరకు యథాతథ స్థితి పాటించండి

నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాల విషయంలో వివరణ ఇవ్వాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలుచేస్తూ తొమ్మిది జిల్లాల వైకాపా అధ్యక్షులు బుధవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు.

Updated : 27 Jun 2024 06:14 IST

వైకాపా కార్యాలయాల కూల్చివేతపై  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాల విషయంలో వివరణ ఇవ్వాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలుచేస్తూ తొమ్మిది జిల్లాల వైకాపా అధ్యక్షులు బుధవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి కోరడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ విచారణను గురువారానికి వాయిదా వేశారు. గురువారం వరకు కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి పాటించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నోటీసులు జారీచేశారు. వీటిని సవాలు చేస్తూ 9 జిల్లాల వైకాపా  అధ్యక్షులు హైకోర్టులో అత్యవసర పిటిషన్లు వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి, న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ‘జాతీయ, గుర్తింపు పొందిన పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించేందుకు 2016లో జీఓ జారీచేశారు. అసెంబ్లీలో 50%కు మించి సంఖ్యాబలం ఉన్న పార్టీకి జిల్లా ప్రధాన కేంద్రంలో రెండెకరాలు కేటాయించవచ్చు. స్థలం కేటాయించాక ఏడాదిలోపు కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తిచేయాలి. ప్లాన్‌ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నిర్మాణాలు జరపవచ్చని అధికారులు మౌఖికంగా తెలిపారు. అందుకే నిర్మాణాలు కొనసాగించాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కూల్చేస్తున్నారు. కూల్చివేత అనేది చివరి అంశంగా ఉండాలి. ఏ క్షణానైనా కూలుస్తారని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారు. స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీచేయాలి’ అని కోరారు. 

కూల్చే ఆలోచన ఉంటే నోటీసులు ఎందుకిస్తారు?

రాష్ట్రప్రభుత్వం తరఫున కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘అధికారులు చట్ట నిబంధనల ప్రకారం నడుచుకుంటారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు. భవనాలను కూల్చే ఉద్దేశం ఉంటే నోటీసులు ఇచ్చి వివరణ ఎందుకు కోరతారు? పిటిషనర్లది ఆందోళన మాత్రమే. వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల విషయంలో అధికారులు ముందుకెళ్లకుండా పిటిషనర్లు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలని అనుకుంటున్నారు. ఈ వ్యాజ్యాల్లో వివరాలు సమర్పించేందుకు స్వల్ప సమయం కావాలి’ అని కోరారు.


రాయచోటిలో వైకాపా కార్యాలయానికి నోటీసు 

ఈనాడు, కడప: అన్నమయ్య జిల్లా రాయచోటిలో అనుమతులు లేకుండా.. ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మించిన వైకాపా కార్యాలయానికి అధికారులు నోటీసు జారీచేశారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అధికారులు కొత్తగా నిర్మించిన భవనానికి బుధవారం నోటీసు అతికించారు. అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారని.. వారం రోజులలోపు సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వైఎస్సార్‌ జిల్లా కడపలో నిర్మిస్తున్న కార్యాలయానికి గతంలోనే నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని