ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జులై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published : 27 Jun 2024 05:43 IST

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందజేత

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జులై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జులైలో రూ.7 వేలు (ఏప్రిల్, మే, జూన్‌ నెలలకుగాను రూ.వెయ్యి చొప్పున కలిపి) తెదేపా ప్రభుత్వం అందించనుంది. ఆగస్టు నుంచి రూ.4 వేల చొప్పున ఇవ్వనుంది. ఈ పింఛన్ల పంపిణీకిగాను ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగికి/ఇతర శాఖల ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి వీలైనంతవరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని స్పష్టం చేశారు. మిగిలిన వారికి రెండో రోజు అందించాలని తెలిపారు. ఎప్పటిలాగానే హెచ్‌ఐవీ బాధితులకు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛను మొత్తాన్ని జమ చేయాలని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పరిశీలించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని