రీ సర్వేపై రైతుల నుంచి అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయ్‌?

భూముల రీ సర్వే నిర్వహణ తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు.

Updated : 27 Jun 2024 06:09 IST

అధికారులను ప్రశ్నించిన  మంత్రి అనగాని సత్యప్రసాద్‌ 
వినతుల స్వీకరణకు  ఏర్పాట్లు చేయాలని ఆదేశం 

సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సర్వే అధికారులతో సమావేశమైన మంత్రి అనగాని సత్యప్రసాద్‌

ఈనాడు, అమరావతి: భూముల రీ సర్వే నిర్వహణ తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. తనకు నిత్యం రీ సర్వేపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాదర్బార్‌ మాదిరిగానే భూ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ప్రత్యేకంగా విజ్ఞప్తుల స్వీకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో రీ సర్వే నిర్వహణ తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన సర్వేపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ జి.సాయిప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, సర్వే శాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్‌ మంత్రికి వివరించారు. ‘13,321 గ్రామాల్లో రీ సర్వే సందర్భంగా డ్రోన్‌ ఫ్లై (1.20 లక్షల చదరపు కిలో మీటర్లు) పూర్తయింది. 12,348 గ్రామాలకు చిత్రాలు పంపించాం. రైతుల ఆమోదంతో 7,110 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించాం. 6,707 గ్రామాల్లో విస్తీర్ణం నిర్ధారణ చేశాం. 6,353 గ్రామాల్లో రీ సర్వే పూర్తయినట్లు నోటిఫికేషన్‌ ఇచ్చాం. 6,316 గ్రామాల్లో రికార్డుల్లో నమోదు ప్రక్రియ పూర్తయింది. సర్వే నంబర్ల స్థానంలో 81 లక్షల ల్యాండ్‌ పార్సిళ్లను జనరేట్‌ చేశాం. 8.64 లక్షల యజమానుల పేర్లను రికార్డుల్లో అప్‌డేట్‌ చేశాం. 86 వేల వివాదాలు పరిష్కరించాం. చివరిగా 22.48 లక్షల యజమానుల పేర్లను రికార్డుల్లో నమోదు చేశాం’ అని వివరించారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. సర్వేయర్లు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసినట్లు చెప్పారని, రీ సర్వే నిర్వహణ తీరుపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ప్రశ్నించారు. సర్వేకు తక్కువ సమయం కేటాయించడం వల్ల పలు ఇబ్బందులు వచ్చాయని అధికారులు వివరణ ఇచ్చారు. 

సుమోటోగా కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తాం..

రాష్ట్రంలో అర్హత కలిగిన వారిలో ఇంకా 34 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేదని అధికారులు మంత్రికి వివరించారు. వీరందరికీ సులువుగా ఉండేలా సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని తెలిపారు. వీరి వివరాలను వీఆర్వోల లాగిన్‌కు పంపించామని చెప్పారు. సుమోటో కింద ఈ ధ్రువీకరణపత్రాలు జారీ చేస్తామని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ తెలిపారు. తండ్రి కులధ్రువీకరణ ఆధారంగా ఈ పత్రాలు అందజేస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు