గనులశాఖలో అన్నీ ఆన్‌లైన్‌ పర్మిట్లే

గనులశాఖలో ప్రక్షాళన మొదలైంది. గత ఐదేళ్లూ ఆన్‌లైన్‌ బిల్లు లేకుండా గుత్తేదారులు చేతిరాతతో రాసిచ్చి భారీగా అక్రమాలు చేయగా.. ఈ విధానానికి చెక్‌పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

Published : 27 Jun 2024 05:39 IST

మంత్రి ఆదేశాలతో ఆ దిశగా చర్యలు చేపట్టిన అధికారులు
సీనరేజి వసూళ్ల గుత్తేదారులూ ఆన్‌లైన్‌ పర్మిట్లు ఇవ్వాల్సిందే
ఇసుకకూ ఆన్‌లైన్‌ విధానం రూపకల్పన

ఈనాడు, అమరావతి: గనులశాఖలో ప్రక్షాళన మొదలైంది. గత ఐదేళ్లూ ఆన్‌లైన్‌ బిల్లు లేకుండా గుత్తేదారులు చేతిరాతతో రాసిచ్చి భారీగా అక్రమాలు చేయగా.. ఈ విధానానికి చెక్‌పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో అన్ని ఖనిజాలకూ ఆన్‌లైన్‌ పర్మిట్ల విధానం ఉండగా, ఇప్పుడూ దాన్నే అమలు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో.. ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గనులశాఖ కార్యదర్శి యువరాజ్, సంచాలకుడు ప్రవీణ్‌కుమార్‌.. అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ ఖనిజానికీ ముద్రిత బిల్లు ఉండకూడదని ఆదేశించారు. దీంతో దీనిపై కసరత్తు మొదలైంది. 

సీనరేజి గుత్తేదారులు అమలుచేయాల్సిందే

రాష్ట్రంలో ఏడు ఉమ్మడి జిల్లాల్లో సీనరేజి వసూళ్ల గుత్తేదారులు.. లీజుదారులకు చేతిరాతతో బిల్లులు జారీచేస్తున్నారు. ప్రభుత్వం ఈ విధానంపై త్వరలో సమీక్ష జరపనుంది. ఈ విధానం కొనసాగించాలని భావిస్తే ఆన్‌లైన్‌ పర్మిట్లే ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికోసం గతంలోనే సిద్ధంచేసిన సాఫ్ట్‌వేర్‌ను మళ్లీ తీసుకొస్తున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా పర్మిట్ల జారీ నిలిపేశారు. రెండు, మూడు రోజుల్లో మళ్లీ పర్మిట్ల జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు గనులశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇసుకకూ చేతిరాత బిల్లులుండవ్‌

ఇసుకలోనూ ఆన్‌లైన్‌ వేబిల్లుల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 నుంచి 2021 మే వరకు ఏపీఎండీసీ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ఇసుక వ్యాపారం జరగ్గా, తర్వాత ఇసుక గుత్తేదారుగా జేపీ సంస్థ వచ్చాక.. చేతిరాత బిల్లులతో నిలువు దోపిడీ చేశారు. ఒకే సీరియల్‌ నంబర్లతో అనేక వేబిల్లులు ముద్రించుకొని, వాటితో ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి, భారీగా దోచుకున్నారు. గనులశాఖ లెక్కల ప్రకారం స్టాక్‌పాయింట్లలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంది. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలన్నా, మరే విధంగా విక్రయించాలన్నా ఆన్‌లైన్‌ పర్మిట్లు ఇచ్చేలా అధికారులు సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. 


ఏపీఎండీసీ లెక్కలు తీయిస్తున్న ఎండీ

పీఎండీసీలో గత ఐదేళ్లలో ఏమి జరిగిందో నివేదిక ఇవ్వాలని అన్ని విభాగాల అధికారులను ఇన్‌ఛార్జి ఎండీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. తొలుత ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం చేసినప్పుడు ఏం జరిగింది? ఇంకా సంస్థకు ఎంత సొమ్ము రావాల్సి ఉంది? సర్వే రాళ్ల సరఫరా వివరాలు, అన్ని విభాగాల్లో ఎంతమంది పొరుగుసేవలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులున్నారు? తదితర వివరాలను గురువారానికి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఏపీఎండీసీ అధికారులు నివేదికలు తయారుచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని