జల సంరక్షణ పనుల్లో రూ.427 కోట్ల బకాయిలు

జగన్‌ ప్రభుత్వం చిన్ననీటి వనరులను నిర్లక్ష్యం చేసింది. అంతకుముందు తెదేపా ప్రభుత్వంలో ‘నీరు-చెటు’్ట పేరుతో జలసంరక్షణ పనులు చేసినా ఆ బిల్లులూ చెల్లించకుండా రైతు సంఘాలను, గుత్తేదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

Published : 27 Jun 2024 05:38 IST

జగన్‌ ప్రభుత్వంలో చిన్ననీటి వనరులపై ఎనలేని నిర్లక్ష్యం
చేసిన పనులకు బిల్లులూ చెల్లించలేదు 

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వం చిన్ననీటి వనరులను నిర్లక్ష్యం చేసింది. అంతకుముందు తెదేపా ప్రభుత్వంలో ‘నీరు-చెటు’్ట పేరుతో జలసంరక్షణ పనులు చేసినా ఆ బిల్లులూ చెల్లించకుండా రైతు సంఘాలను, గుత్తేదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. రైతు సంఘాల సమాఖ్య, మరికొన్ని సంఘాలు కలిసి ఈ బిల్లుల కోసం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేయాల్సివచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘నీరు-చెటు’్ట బిల్లులు ఏమేరకు పెండింగ్‌లో ఉన్నాయని పరిశీలిస్తే.. ఇంకా రూ.427 కోట్లు చెల్లించాల్సి ఉందని తేలింది. అప్పట్లో చంద్రబాబు ఆదేశంతో ప్రత్యేకంగా ఒక సెల్‌ ఏర్పాటు చేసి నీరు-చెట్టు బకాయిల వివరాలు సేకరించి న్యాయస్థానాల్లో పోరాటం చేశారు. వైకాపా ప్రభుత్వం విజిలెన్సు విచారణల పేరుతో, పనులు నాణ్యంగా చేయలేదంటూ ఈ బిల్లుల చెల్లింపునకు అవరోధాలు కల్పించినా తగిన సమాచారంతో రైతు సంఘాలు పోరాటం చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం పెండింగులో ఉన్న రూ.427 కోట్ల బకాయిలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణతో కూడిన నాయకుల బృందం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని బుధవారం కలిసి విన్నవించింది. 

నాడు ఉద్ధృతంగా జలసంరక్షణ పనులు

2014-19 మధ్య రాష్ట్రంలో జలసంరక్షణ పనులు ఉద్ధృతంగా జరిగాయి. చిన్ననీటి వనరుల ద్వారా అనేక కరవు ప్రాంతాల్లో సాగు, తాగు నీరు ఇవ్వవచ్చనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వంలో పనులు చేశారు.

పెద్ద ఎత్తున చెరువులు పూడిక తీయించారు. చెరువులు కళకళలాడితే భూగర్భజలాలు నిండుగా ఉండి సాగుకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో పనులను పరుగులు పెట్టించారు.

  • తెదేపా హయాంలో కట్టడాల మరమ్మతులు, గేట్ల మరమ్మతులు తదితర పనులు ‘నీరు-చెట్టు’ కింద చేశారు రాష్ట్రంలో అప్పటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఇలాంటి పనులు 10,623 చేపట్టారు. ఇందుకోసం రూ.644.27 కోట్లు ఖర్చు చేశారు.
  • చెరువుల్లో పూడికతీత పనులను అన్ని జిల్లాల్లోనూ చేశారు. మొత్తం 8,708 పనులు చేయగా రూ.530.58 కోట్లు వెచ్చించారు. 
  • ఇతర నీటి సంరక్షణ పనులకు రూ.532.55 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అన్ని కలిపి రూ.1,707 కోట్లు ఖర్చు చేసినా పెండింగు బిల్లులు అనేకం జగన్‌ ప్రభుత్వం చెల్లించలేదు. పైగా విజిలెన్సు విచారణ, ఇతర అంశాల పేరుతో అధికారులను, ఇతరులను కూడా ఇబ్బంది పెట్టారు. విజిలెన్సు విచారణలో తేలిన అక్రమాలపై చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినా...ఆ పేరుతో అన్ని పనులకూ బిల్లులు నిలిపివేయడమే సమస్యగా మారింది.

న్యాయస్థానాల్లో పోరు...

బిల్లుల చెల్లింపు కోసం న్యాయస్థానంలో పోరాటం చేశారు. మొత్తం 9,391 కేసులు దాఖలయ్యాయి. ఇందులో రిట్‌ పిటిషన్లు ఉన్నాయి. ఆ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు వెలువడినవీ ఉన్నాయి. కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఈ న్యాయ పోరాటం ఫలితంగా ఇంతవరకు రూ.999 కోట్ల వరకు చెల్లించినా ఇంకా రూ.427 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తేల్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని