సంక్షిప్తవార్తలు(11)

వైఎస్సార్‌ రైతు భరోసా వెబ్‌సైట్‌ను ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో మార్పు చేశామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.

Updated : 27 Jun 2024 06:05 IST

‘అన్నదాత సుఖీభవ’ పేరుతో కొత్త వెబ్‌సైట్‌

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా వెబ్‌సైట్‌ను ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో మార్పు చేశామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. ‘చంద్రబాబు, అచ్చెన్నకూ వైకాపా రంగులేశారు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. పాత వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ను మార్చాలని ఐటీ శాఖను కోరామని, సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదని తెలిపారు. ఐటీ అధికారులతో తాజాగా చర్చించి పరిష్కరించామని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, ఏడీఎస్‌బీ పేర్లతో కొత్త వెబ్‌పేజీ తయారు చేశామని వెల్లడించారు.


కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ రాజీనామా ఆమోదం

ఈనాడు డిజిటల్, అమరావతి: కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ పదవికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సమీర్‌శర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. బుధవారం గెజిట్‌ జారీ చేసింది.


ఇంటర్‌ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీలో 43% మంది ఉత్తీర్ణత

ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌ 

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 42.54% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 1,33,591 మంది పరీక్షలు రాయగా.. 56,836 మంది పాసయ్యారు. ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. మార్కుల మెరుగుదలకు రాసిన విద్యార్థుల్లో 79% మందికి మార్కులు పెరిగాయి. పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ కలిపి మొదటి ఏడాది ఉత్తీర్ణులైన వారి సంఖ్య 80 శాతానికి పెరిగింది.  జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌కు ఈ నెల 28 నుంచి జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది.  


‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో  62% మంది ఉత్తీర్ణత

ఈనాడు, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. పరీక్షలకు 1,07,883 మంది హాజరు కాగా.. 67,115 మంది పాసయ్యారు. బాలురు 67,740 మంది పరీక్షలు రాయగా.. 40,638 (59.99%)మంది, బాలికలు 40,143 మంది పరీక్షలు రాయగా.. 26,477 (65.96%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ ప్రవేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు ఈ నెల 27 నుంచి జులై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.  


నేడు, రేపు కొన్నిచోట్ల భారీ వర్షాలు

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. పిడుగులు పడొచ్చని, గంటకు గరిష్ఠంగా 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది. బుధవారం అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నంద్యాల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా రాత్రి పది గంటల వరకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో 74.5 మి.మీ. వర్షపాతం నమోదయింది.


ఏపీకి ఐపీఎస్‌ అధికారి మహేష్‌కుమార్‌ లడ్హా

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సర్వీసులో డిప్యుటేషన్‌పై ఉన్న ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి మహేష్‌కుమార్‌ లడ్హా తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్‌లో ఐజీగా పని చేస్తున్నారు. డిప్యుటేషన్‌ గడువుకు ముందే ఆయనను రాష్ట్రానికి పంపేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


పార్కింగ్‌ ఫీజు వసూళ్లపై హైకోర్టులో పిల్‌

కౌంటర్‌ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం

ఈనాడు, అమరావతి: షాపింగ్‌ మాళ్లు, మల్టీప్లెక్స్‌ల్లో వాహనాల పార్కింగ్‌ ఫీజు వసూలుకు వీలు కల్పిస్తూ 2021లో జారీ అయిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్స్‌లు తదితర ప్రాంతాల్లో పార్కింగ్‌ ఫీజు వసూలును సవాలు చేస్తూ విజయవాడకు చెందిన చందన మోహనరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. జీవో 35 స్థానంలో జీవో 13 తీసుకొచ్చారన్నారు. జీవో ప్రతిని కోర్టుకు అందజేశారు.


గిరిజన ప్రాంతాల్లో మహిళా చట్టాలపై అవగాహన

ప్రాజెక్టు రూపకల్పనకు మహిళా కమిషన్‌ కసరత్తు

ఈనాడు, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ తీర్మానించింది. మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి అధ్యక్షతన త్రైమాసిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల సందర్శన, అక్కడ నిర్వహించాల్సిన సదస్సులపై చర్చించారు. బసివిని, జోగిని, మాతంగి వంటి అనాగరికి ఆచారాలపై కమిషన్‌ సభ్యులు ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సభ్యులకు కేటాయించిన ప్రాంతాల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంపై ఛైర్‌పర్సన్‌ ఆరా తీశారు. 


స్పోర్ట్స్‌ క్లబ్‌ యాప్‌లో ఇంకా జగన్‌ స్మరణే

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మారినా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల వైఖరిలో, ఆలోచనల్లో మార్పు రాలేదు. ఇంకా మాజీ సీఎం జగన్‌ స్మరణలోనే ఇప్పటికీ పరితపిస్తున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలోని స్పోర్ట్స్‌ క్లబ్‌ యాప్‌లో ఇంకా జగన్‌ ఫొటోలే కనిపిస్తున్నాయి. శాప్‌లో వైకాపా అభిమానులైన కొందరు అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో యాప్‌లో జగన్‌ ఫొటోలు అలాగే ఉన్నాయి. దీనిపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఎంపీఈఓలను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలి

ఈనాడు డిజిటల్, అమరావతి: వ్యవసాయశాఖలో ఒప్పంద పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న మల్టీ పర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (ఎంపీఈఓ)లను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆ ఉద్యోగుల సంఘం రాయలసీమ జోన్‌ అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్‌ కోరారు. ఉమ్మడి అనంతపురం నుంచి చిత్తూరు జిల్లాకు కేటాయించిన ఎంపీఈఓల బేసిక్‌ను రద్దు చేసి, పాత పద్ధతినే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ను కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. 


‘ఆరోగ్య మిత్రలకు పనికి తగ్గ వేతనమివ్వాలి’

ఈనాడు డిజిటల్, అమరావతి: ఆరోగ్య మిత్రలు చేస్తున్న పనికి సమానమైన వేతనాన్ని ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కి ఆ సంఘం ప్రతినిధులు మాచర్ల బుజ్జి, ఎం.ప్రత్యూష విజ్ఞప్తి చేశారు. వెలగపూడిలోని సచివాయలంలో బుధవారం ఆయన్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని