మన నడవడిక మన్ననలు పొందాలి

‘మనపై ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారు. అభ్యర్థులందరినీ శాసనసభకు పంపించారు. వారి నమ్మకాన్ని సభలో ప్రతిఫలింపజేద్దాం’ అని జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు.

Updated : 26 Jun 2024 06:43 IST

సభలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దాం
ఎమ్మెల్యేలకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం

జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘మనపై ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారు. అభ్యర్థులందరినీ శాసనసభకు పంపించారు. వారి నమ్మకాన్ని సభలో ప్రతిఫలింపజేద్దాం’ అని జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. ‘జనసేన నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది సభకు కొత్తవారే. అందరం సభ నియమావళి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలి’ అని సూచించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సభా వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ‘మనమంతా తొలి వంద రోజులకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. వాటిపై అధ్యయనం చేయాలి. ప్రభుత్వ శాఖలు, పాలనాపరమైన విధివిధానాలు, నిబంధనలు, పథకాలు, వాటి అమలు తీరుతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా.. లేదా అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి’ అని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. 

సమస్యల పరిష్కారానికి ‘జనవాణి’ 

ఎమ్మెల్యేలందరూ తమతమ నియోజకవర్గాల్లో ‘జనవాణి’ కార్యక్రమం చేపట్టాలని పవన్‌ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కట్టుబడి ఉండాలని, ప్రజాసంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమంగా సాగాలని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే అవసరం ఉందని అన్నారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. 

పరుష పదజాలం వాడొద్దు  

భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ‘అధికారులతో మాట్లాడేటప్పుడే కాకుండా చర్చల్లో కూడా పరుష పదజాలం వాడొద్దు. ప్రజలతో గౌరవంగా ఉండాలి. వారు సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలి’ అని తెలిపారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని పవన్‌ తెలిపారు.

అధ్యయనం చేయాలి: మంత్రి నాదెండ్ల మనోహర్‌ 

‘బడ్జెట్‌ సమావేశాలు త్వరలో మొదలవుతాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సభలో ప్రశ్నలు లేవనెత్తడానికి, చర్చల్లో పాల్గొనడానికి తగిన అధ్యయనం చేయాలి. నియోజకవర్గ అంశాలను ప్రస్తావించడంతో పాటు వాటిని రాష్ట్ర స్థాయి కోణంలో కూడా చర్చించాలి’ అని సూచించారు.


దేశం మెచ్చేలా పంచాయతీరాజ్‌ వ్యవస్థను తీర్చిదిద్దుదాం

ఈనాడు, అమరావతి: దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు తిరిగి చూసేలా అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఉద్యోగులు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ కోరారు. ఎంతో ఇష్టంతో కీలకమైన ఈ శాఖను తీసుకున్నానని, ఇందులో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అహర్నిశలూ కృషి చేస్తానని, ఉద్యోగులూ తగిన సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన పంచాయతీరాజ్‌ శాఖలోని ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నాక వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ దెబ్బ తీసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా గ్రామాభివృద్ధిని ఎంతో నిర్లక్ష్యం చేసింది. జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని సరిగా అమలు చేసి ఉంటే వాటి ఫలాలు గ్రామీణ ప్రజలకు అందేవి. కేంద్రం నుంచి ఇంకా రూ.1,600 కోట్లు రావలసి ఉంది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. వారిని నేను ప్రత్యేకంగా గౌరవిస్తాను. నేనూ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడినే’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని