Brain Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌కు దారితీసే... శత్రువులు అవే!

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో చిన్న వయసులో బ్రెయిన్‌స్ట్రోక్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated : 29 Oct 2023 08:21 IST

హైబీపీ, మధుమేహం, పొగాకు ప్రధాన కారణం
తాజా అధ్యయనంలో వెల్లడి
నేడు అంతర్జాతీయ స్ట్రోక్‌ డే

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో చిన్న వయసులో బ్రెయిన్‌స్ట్రోక్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు 60-70 ఏళ్ల వయసులో ఈ సమస్య కనిపించేది.. బాధితుల్లో 30-45 ఏళ్ల మధ్య వయసున్న వారు 15 శాతం వరకు ఉంటున్నారని చెబుతున్నారు. మస్తిష్క రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యం కారణంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌  సంభవిస్తుంది. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తనాళాలు పూర్తిగా లేదా పాక్షికంగా మూసుకుపోయి, మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరగకపోవడం స్ట్రోక్‌కు కారణమవుతోంది. దీనికి హైబీపీ, మధుమేహం, పొగతాగడం కారణాలని ఇండో-అమెరికన్‌ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో తేలిందని ఉచ్ఛా ్వస్‌ ట్రాన్సిషనల్‌ కేర్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ రాం పాపారావు తెలిపారు.

లక్షణాలివీ...

మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మెదడులోని కాళ్లు, చేతులను నియంత్రించే భాగాలకు రక్తసరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు ప్రభావితం కావచ్చు.

* మాట పడిపోవడం, స్తిమితంగా లేకపోవడం, తిమ్మిరి, చూపు, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు కన్పిస్తే  బ్రెయిన్‌ స్ట్రోక్‌గా భావించి తక్షణం చికిత్స అందించాలి.

* అధిక మొత్తంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. రోజుకు 3-4 గ్రాములకు మించకపోవడం మంచిది.

అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఇలా...(శాతాల్లో)

  • బాధితుల సగటు వయసు- 58.3 ఏళ్లు
  • మొదటి 4 వారాల్లో మరణిస్తున్న వారు: 30.5
  • తర్వాత అయిదేళ్లలో మృతి చెందుతున్న వారు: 27.1
  • అయిదేళ్లలో మరోసారి స్ట్రోక్‌కు గురయ్యేవారు: 21.1
  • స్ట్రోక్‌ తర్వాత జీవన నాణ్యత కోల్పోతున్నవారు: 32.4
  • పూర్తిగా కోలుకుంటున్నది: 40.5
  • కుంగుబాటు సమస్య ఎదుర్కొంటున్న వారు: 5.1

మంచి అలవాట్లతో ముప్పు తప్పించుకుందాం

మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే నాళాలు పాక్షికంగా లేదా పూర్తిగా పూడుకుపోవడం వల స్ట్రోక్‌ లేదా పక్షవాతం వస్తుంది. దీనిని ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ అని పిలుస్తారు. అదే రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తం లీక్‌ అయితే హెమరేజిక్‌ స్ట్రోక్‌గా వ్యవహరిస్తారు. అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ముప్పు ఉన్నట్లే. ఫైబర్‌, ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేడ్లు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు మేలు చేస్తాయి. రోజులో కనీసం 45 నిమిషాలు వారానికి 5 రోజులు వేగవంతంగా నడవాలి. సైక్లింగ్‌, ఈత, షటిల్‌, టెన్నిస్‌ వంటి ఆటలు ఆడటం మంచిదే. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు 400 గ్రాములకు తగ్గకుండా చూసుకోవాలి. కనీసం 3-4 లీటర్లు నీళ్లు తాగాలి.

డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి, న్యూరాలజిస్టు, అపోలో ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని