DS: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌ కన్నుమూత

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ అలియాస్‌ డీఎస్‌(76) కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Updated : 30 Jun 2024 06:38 IST

ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన నేత
నేడు నిజామాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు 

ఈనాడు, హైదరాబాద్, నిజామాబాద్‌ - ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ అలియాస్‌ డీఎస్‌(76) కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన తండ్రి పార్థివదేహాన్ని చూసి డీఎస్‌ పెద్దకుమారుడు సంజయ్‌ కంటతడి పెట్టారు. పార్లమెంట్‌ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న డీఎస్‌ చిన్న కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ శనివారం బంజారాహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. అనంతరం భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో నిజామాబాద్‌కు తరలించారు. ఆదివారం నిర్వహించనున్న అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ శాంతికుమారిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం నిజామాబాద్‌కు వెళ్లనున్నారు. డీఎస్‌ మరణానికి సంతాప సూచకంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ జెండాను అవనతం చేశారు. 

అర్గుల్‌ రాజారాం శిష్యుడిగా గుర్తింపు 

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ను రెండుసార్లు గెలిపించిన ఘనత డీఎస్‌ సొంతం. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ గొంతుకగా నిలిచారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో 1948 సెప్టెంబరు 27న వెంకట్రాం, లక్ష్మీబాయిలకు డీఎస్‌ జన్మించారు. భార్య విజయలక్ష్మి, కుమారులు సంజయ్‌, అర్వింద్‌. ఆయన తండ్రి చిన్న బీడీ కార్ఖానా యజమాని. వేల్పూరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాక... హైదరాబాద్‌లోని మెథడిస్ట్‌ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చేరిన డీఎస్, ఇంటర్‌ వరకు అక్కడే చదివారు. నిజాం కళాశాలలో బీఏ చేస్తున్నప్పుడు ఉస్మానియా విద్యార్థి సంఘంలో చేరి, 1969-70 మధ్య ఎన్‌ఎస్‌యూ రాష్ట్ర తొలి కన్వీనర్‌గా పనిచేశారు. అనంతరం ఆర్‌బీఐలో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించారు. నిజామాబాద్‌లో న్యాయవాదిగానూ పనిచేశారు. ఇదే జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన అర్గుల్‌ రాజారాంను తన గురువుగా భావించేవారు. మాజీ డిప్యూటీ సీఎం జగన్నాథరావు, కర్ణాటక మాజీ సీఎం గుండూరావుతోనూ సన్నిహితంగా ఉండేవారు. వీరి ఆశీర్వాదంతోనే 1982లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, 1983లో నిజామాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. రెండుసార్లూ ఓడిపోయినా... 1989 ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994 ఎన్నికల్లో మరోసారి ఓడారు. 1999, 2004 ఎన్నికల్లో విజయం సాధించి... సీఎల్పీ ఉపనాయకుడిగా, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డిల క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. 

పీసీసీ అధ్యక్షుడిగా అరుదైన రికార్డు 

తొలిసారి 2003 ఆగస్టులో పీసీసీ అధ్యక్షునిగా¦ నియమితులైన డీఎస్‌... అప్పట… సీఎల్పీ నేత వైఎస్‌తో కలిసి 2004 ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. అనంతరం డీఎస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించి, పార్టీ బాధ్యతలను కేశవరావుకు అప్పగించారు. అనూహ్యంగా కేశవరావు రాజీనామా చేయడంతో 2008 మార్చిలో పీసీసీ అధ్యక్షుడిగా మళ్లీ డీఎస్‌కే అవకాశం దక్కింది. డీఎస్, వైఎస్‌ల ధ్వయం 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తెచ్చింది. అయితే, నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి 2009 సార్వత్రిక ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో ఓడిపోయిన డీఎస్‌ను పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, మూడోసారి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. ఆయనకు సోనియా, మన్మోహన్, ప్రణబ్‌ ముఖర్జీలతో సాన్నిహిత్యం ఉండేది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యధికసార్లు దిల్లీకి వెళ్లి వచ్చారు. 

తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక 

తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌లో తనను అవమానిస్తున్నారని, నిరసనగా పార్టీని వీడుతున్నట్లు 2015 జులైలో సోనియాకు డీఎస్‌ లేఖ రాశారు. అనంతరం తెరాస(ప్రస్తుత భారాస)లో చేరడంతో అప్పటి సీఎం కేసీఆర్‌... డీఎస్‌ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. తెరాస తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చివరికి తెరాసను వీడి 2023 మార్చి 26న గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా మరుసటి రోజే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తర్వాత అనారోగ్యంతో డీఎస్‌ బయటకు రాలేదు.

ఇద్దరు కుమారులు సైతం... 

డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ కాంగ్రెస్‌ నుంచి నిజామాబాద్‌ కార్పొరేషన్‌ తొలి మేయర్‌గా పనిచేశారు. చిన్న కుమారుడు అర్వింద్‌ 2017లో భాజపాలో చేరి, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 

విషాదంలో పెద్ద కుమారుడు సంజయ్, డీఎస్‌ సతీమణి, చిన్న కుమారుడు అర్వింద్‌

ప్రముఖుల నివాళి 

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సత్యకుమార్‌యాదవ్, ఎంపీలు మల్లురవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మాజీ మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, టీజీ వెంకటేష్, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నేతలు వీహెచ్‌ హనుమంతరావు, కె.కేశవరావు, డొక్కా వరప్రసాద్, మైసూరారెడ్డి, సమరసింహారెడ్డి, గద్వాల్‌ విజయలక్ష్మి, దానం నాగేందర్, మధుయాస్కీగౌడ్, నిరంజన్, చింతల రామచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, రామచందర్‌రావు తదితరులు డి.శ్రీనివాస్‌ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీభవన్‌లోనూ కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించారు.

డీఎస్‌కు నివాళి అర్పిస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

ఉద్యమంలో ఆయనది చెరగని ముద్ర: సీఎం రేవంత్‌రెడ్డి 

‘‘ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్‌ కాంగ్రెస్‌ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన సేవలు అందరికీ ఆదర్శం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

ప్రజలకు తీరని లోటు: కేసీఆర్, కేటీఆర్‌ 

డీఎస్‌ మృతి తీరని లోటని భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. డీఎస్‌ పార్థివదేహానికి మాజీ మంత్రి, భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు.

రాజకీయ చతురత ఉన్న నేత: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

నిజామాబాద్‌ అర్బన్, న్యూస్‌టుడే: రాజకీయ చతురత కలిగిన నేత డి.శ్రీనివాస్‌ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి శనివారం రాత్రి వచ్చి మాజీ మంత్రి డీఎస్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. డీఎస్‌ తనయుడు ఎంపీ అర్వింద్‌ను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగు దశబ్దాలపాటు రాజకీయాల్లో ఉంటూ ప్రజా సేవలో ముందున్న వ్యక్తిగా పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించారన్నారు. పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు.


పేదల కోసం సుదీర్ఘకాలం పనిచేశారు: ప్రధాని మోదీ 

‘‘పేదల సాధికారత కోసం డీఎస్‌ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. డీఎస్‌ మృతికి ఇదే నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో తెలిపారు. తెలంగాణ, ఝార్ఖండ్‌ రాష్ట్రాల గవర్నర్‌  సి.పి.రాధాకృష్ణన్‌ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌లు అన్నారు. 


డీఎస్‌ మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

ఈనాడు, అమరావతి: తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్‌ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్రవేశారని చంద్రబాబు కొనియాడారు. 


తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు 

డీఎస్‌ మరణం బాధాకరం. తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదాన్ని వినిపించారు. ఆయన్ను కలిసినప్పుడు నా రాజకీయ ప్రయాణం గురించి అడిగారు. జనసేన పార్టీ ఎదుగుదలను ఆకాంక్షించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

పవన్‌ కల్యాణ్, ఏపీ ఉపముఖ్యమంత్రి


కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు

మాజీ మంత్రి కేటీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని