Andhra News: ‘వేలిముద్రలు’ చెరిపేసిన నేరం జగన్‌దే!

గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర పోలీసు శాఖ 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచిన అధునాతన సర్వర్లు కాలిపోయాయి.

Updated : 03 Jul 2024 07:23 IST

నేర నిర్ధారణ సాంకేతిక వ్యవస్థ నిర్వహణ గాలికి
రూ.2 కోట్లూ విదల్చని వైకాపా సర్కారు
కాలిపోయిన సర్వర్లు, యూపీఎస్‌లు
10 లక్షల మంది నేరగాళ్ల వేలిముద్రల డేటా గల్లంతు
తెదేపా ప్రభుత్వంపై కసితో వ్యవస్థపై కక్ష
నిధులడిగితే, నాటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి హేళన

ఈనాడు, అమరావతి: గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర పోలీసు శాఖ 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచిన అధునాతన సర్వర్లు కాలిపోయాయి. వాటి యూపీఎస్‌లు పేలిపోయాయి. నేరగాళ్లు, అనుమానితుల గుర్తింపు, నేర పరిశోధన, ఛేదన కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఏఎఫ్‌పీఐఎస్‌ (ఆటోమేటెడ్‌ ఫింగర్‌ అండ్‌ పామ్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌) వార్షిక నిర్వహణకు కేవలం రూ.2 కోట్ల నిధులు ఇవ్వని కారణంగా ఏడాదిన్నరగా ఆ వ్యవస్థంతా కుప్పకూలిపోయింది. దీంతో నేరఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలను పాత నేరగాళ్ల వేలిముద్రలతో సరిపోల్చేందుకు పోలీసులకు అవకాశం లేకుండా పోయింది. కొత్తగా సేకరించిన వేలిముద్రలను కూడా డేటాబేస్‌లో నిక్షిప్తం చేసే వీల్లేకుండా పోయింది. వెరసి.. అనుమానితులు, తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్లను పట్టుకునే మార్గాల్లో ఒకటి మూసుకుపోయినట్లైంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారన్న ఏకైక కారణంతో కక్షగట్టి మరీ ఏఎఫ్‌పీఐఎస్‌ను జగన్‌ సర్కారు దెబ్బతీసింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక వైకాపా హయాంలో జరిగిన ఇలాంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

వ్యవస్థపై రాజేంద్రనాథరెడ్డి వెటకారాలు

తెదేపా ప్రభుత్వ హయాంలో 2017లో ఏపీసీఐడీలోని వేలిముద్రల విభాగంలో ఏఎఫ్‌పీఐఎస్‌ను ఏర్పాటు చేశారు. పాపిలోన్‌ అనే రష్యా సంస్థ నుంచి రూ.10 కోట్లు వెచ్చించి ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకున్నారు. ఏపీ పోలీసు డేటా సెంటర్‌లోని సర్వర్‌లలో 10 లక్షల మందికిపైగా పాత నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచారు. 2017 నుంచి 2022 వరకూ ఐదేళ్ల పాటు ఈ వ్యవస్థ వార్షిక నిర్వహణ చేపట్టేలా తెదేపా హయాంలోనే ఒప్పందం కుదరడంతో సంబంధిత సంస్థ వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా మూడేళ్ల పాటు పర్యవేక్షించింది. 2022లో నాటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి ఏఎఫ్‌పీఐఎస్‌కు వార్షిక నిర్వహణ నిధుల చెల్లింపును నిలిపేశారు. నేరగాళ్ల గుర్తింపులో ఇది కీలకమని పోలీసు అధికారులు చెప్పినా లెక్కచేయలేదు. ‘ఈ వ్యవస్థ లేకముందు పోలీసింగ్‌ లేదా? గతంలో నేరగాళ్లను పట్టుకోలేదా? ఈ వ్యవస్థ ఉంటేనే పోలీసు శాఖ పనిచేస్తుందా?’ అంటూ వెటకారమాడినట్లు సమాచారం. నిర్వహణ లేక గతేడాది ఏప్రిల్‌లో ఏఎఫ్‌పీఐఎస్‌ సర్వర్లు కాలిపోయాయి. యూపీఎస్‌లు పేలిపోయాయి. మొత్తంగా ఆ వ్యవస్థే దెబ్బతింది.

నేరగాళ్ల గుర్తింపు ప్రశ్నార్థకం!

ఏఎఫ్‌పీఐఎస్‌ ద్వారా నేరగాళ్లు, అనుమానితులను గుర్తించడానికి నాటి తెదేపా ప్రభుత్వం 580 పోలీసు స్టేషన్లకు మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ డివైజ్‌ (ఎంఎస్‌సీడీ)లను అందించింది. పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పుడు, తనిఖీలు చేస్తున్నప్పుడు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారి వేలిముద్రలు, హస్తముద్రలను ఎంఎస్‌సీడీలో తీసుకుంటే, వాటిని ఆ పరికరం ఏఎఫ్‌పీఐఎస్‌ డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉన్న లక్షల మంది నేరగాళ్ల వేలి, హస్త ముద్రలతో సరిపోల్చేది. వాటితో సరిపోలితే అతని పేరు, చిరునామా, పాత కేసులు, జైలు జీవితం, శిక్షలు తదితర వివరాలన్నీ నిమిషాల్లో ప్రత్యక్షమయ్యేవి. దీంతో పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకునేవారు. అమాయకులైతే వదిలేసేవారు. సర్వర్లు కాలిపోవటంతో ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎంఎస్‌సీడీలన్నీ నిరుపయోగమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఠాణాలకు ఎంఎస్‌సీడీలను సమకూర్చేందుకు, వేలిముద్రల సాంకేతిక విధానాన్ని మెరుగుపరిచేందుకు పోలీసు బలగాల ఆధునికీకరణ (ఎంవోపీఎఫ్‌) కింద కేంద్రం రూ.7 కోట్ల నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ.5 కోట్లు ఇవ్వలేదు. దీంతో కేంద్రం నిధులు రాకుండాపోయాయి.

  • నేర ఘటనా స్థలంలో వేలి, హస్తముద్రలు సేకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేసేందుకు 98 పోలీసు సబ్‌ డివిజన్లలో లైవ్‌ స్కానర్లను తెదేపా హయాంలో ఏర్పాటు చేశారు. ఈ వేలి, హస్తముద్రలను ఏఎఫ్‌పీఐఎస్‌ డేటాబేస్‌లోని సమాచారంతో సరిపోల్చి నేరగాళ్లను గుర్తించేందుకు జిల్లా కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు పెట్టారు. ఇప్పుడవీ నిరుపయోగంగా మారాయి. 
  • గతంలో ఈ వ్యవస్థను ఉపయోగించుకుని క్లిష్టమైన కేసుల్ని ఛేదించారు. పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకున్నారు. జనం గుమికూడిన ప్రాంతాల్లో అనుమానితుల్ని పసిగట్టేందుకు, దొంగతనం కేసుల్లో రికవరీలకు, అనాథ మృతదేహాలను గుర్తించేందుకు అవకాశమున్న ఈ కీలక వ్యవస్థను జగన్‌ ప్రభుత్వం సర్వనాశనం చేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని