Nara Lokesh: ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్‌

గత ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్‌ సూచించారు.

Updated : 03 Jul 2024 07:18 IST

ఈనాడు, అమరావతి: గత ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్‌ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), డీఎస్సీ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మెగా డీఎస్సీ, టెట్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీఓ-117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పొరుగుసేవల బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి, వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి’’ అని ఆదేశించారు. 

వయో పరిమితిపై చర్చించి నిర్ణయం

మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్జీటీ పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా.. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేటు పాఠశాల అనుమతుల రెన్యువల్‌ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దని లోకేశ్‌ సూచించారు. టెట్‌ సిలబస్‌లో మార్పు చేయలేదని, సిలబస్‌ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.


నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి కల్పన: మంత్రి లోకేశ్‌ 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర యువతలో నైపుణ్యాలు గుర్తించి శిక్షణ ఇప్పించేందుకు నైపుణ్య గణన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికలను సిద్ధం చేయాలి. విదేశాల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి’’ అని ఆదేశించారు. సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్‌ గౌర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ రాజబాబు, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం డైరెక్టర్‌ నవ్య, సీడ్‌ యాప్‌ సీఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని