Polavaram: నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్‌కు ఏం కాదు

‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు.

Updated : 02 Jul 2024 06:41 IST

పోలవరం పర్యటనలో అంతర్జాతీయ నిపుణుల వ్యాఖ్య
వివిధ కోణాల్లో పరిస్థితుల అంచనా
కొన్ని అదనపు పరీక్షలకు సిఫార్సు
వెంటనే ప్రారంభించిన అధికారులు

దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ ఖాళీల్లో ఉన్న మట్టి, ఇసుక తీస్తున్న నిపుణుడు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పోలవరం: ‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. ఒక డయాఫ్రం వాల్‌కు మరో కొత్త కట్టడాన్ని అనుసంధానించినంత మాత్రాన రెండింటి సమన్వయం సాధ్యం కాదన్న ఆలోచననూ వారు తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ను సందర్శించిన క్రమంలో జరిగిన చర్చలో వారు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. వాటిపై అక్కడ ఉన్న కేంద్ర జలసంఘం నిపుణులు, అఫ్రి డిజైన్‌ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజినీరింగ్‌ అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూ వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రాజెక్టులో కీలక కట్టడమైన డయాఫ్రం వాల్‌ గోదావరి భారీ వరదలకు ధ్వంసమైంది. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలా, పాతదానికే మరమ్మతులు చేసి, కొంతమేర కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించాలా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై సోమవారం చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌ను మరమ్మతు చేసుకుంటే సరిపోతుంది కదా అని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ కట్టడం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమయింది? ఎప్పుడు పూర్తయింది అని నిపుణులు ప్రశ్నించారు. డయాఫ్రం వాల్‌ వరద నీటిలో ఉండిపోయింది కదా.. ఏం నష్టం జరగదా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. వరద ఆ కట్టడంపై ప్రవహించినంత మాత్రాన ఏమీ నష్టం వాటిల్లదని, వరద నీటిలో ఉన్నంత మాత్రాన ఏం జరగదని నిపుణులు బదులిచ్చారు. ఈ డయాఫ్రం వాల్‌కు కొత్త కట్టడం జత చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా.. అలాంటివేమీ ఉండవనీ సమాధానమిచ్చారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన డయాఫ్రం వాల్‌ను వెడల్పు చేసి నిర్మించుకున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు. పాత డయాఫ్రం వాల్‌ ఒక సామర్థ్యంతో, కొత్తది మరో సామర్థ్యంతో పని చేస్తాయన్నది సరికాదని వివరించారు. డయాఫ్రం వాల్‌పై జాతీయ జలవిద్యుత్తు పరిశోధన సంస్థ పరీక్షించి ఇచ్చిన నివేదిక ప్రతులను నిపుణులు తీసుకున్నారు. డయాఫ్రం వాల్‌పై ఎలక్ట్రోడ్ల సాయంతో కాకుండా అక్కడక్కడా తవ్వి, మెటీరియల్‌ తీసి పరీక్షించాలని సూచించారు. డయాఫ్రం వాల్‌ గ్యాప్‌ల్లో ఉన్న మట్టి, ఇసుక నమూనాలను పరిశీలించారు. అది డయాఫ్రం వాల్‌లో ఉన్న మెటీరియల్‌ కాదని, పైన వచ్చి చేరిన ఇసుక మాత్రమే అని అధికారులు తెలియజేశారు. దీంతో డయాఫ్రం వాల్‌ ధ్వంసమైన చోట కొన్ని నమూనాలు తీసి పరిశీలించారు.

కాఫర్‌ డ్యాంల సీపేజీపై పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న అంతర్జాతీయ నిపుణులు

సీపేజీపై మరిన్ని పరీక్షలకు సిఫార్సు

ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు.. అక్కడ ఇప్పటికే చేసిన పరీక్షల నివేదికలను సరిచూశారు. వెంటనే మరికొన్ని పరీక్షలు చేయించాలని, ఆ ఫలితాలను మంగళవారం చూస్తామని సూచించారు. దీంతో స్థానిక ఇంజినీరింగ్‌ అధికారులు వెంటనే ఆ పరీక్షలు ప్రారంభించారు. వైబ్రో కాంపాక్షన్‌ పనులు, గ్యాప్‌-1 ప్రధాన డ్యాం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. క్లే కోర్‌ (బంకమట్టి) ఉన్న చోట నిర్మాణాలు కష్టమనే అభిప్రాయాన్ని కూడా వారు తోసిపుచ్చారు. అలా నిర్మించిన ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నారు.

డయాఫ్రం వాల్‌ నిర్మాణ ప్రాంతంలో సాంకేతిక అంశాలు పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్న రిచర్డ్‌ డోనెల్లీ

నేడు, రేపు సమీక్షలు

అంతర్జాతీయ నిపుణులు డివిడ్‌ బి.పాల్, రిచర్డ్‌ డోన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌ తదితరులు మంగళ, బుధవారాల్లో పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు ప్రాజెక్టు పరిశీలించినవారు చివరి రెండు రోజులు.. అందుబాటులో ఉన్న సమాచారంపై అధ్యయనం చేసి అధికారులు, ఇతర నిపుణులతో చర్చిస్తారు. దీంతో ప్రస్తుతం ఉన్న నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో, ఇంకా ఏమైనా పరీక్షలు చేయించాలా అని అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. నిపుణుల్లో కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ఇప్పటికిప్పుడు ఏ పరిష్కారాలు చూపే అవకాశం లేదని.. నలుగురూ అంతర్గతంగా చర్చించి నివేదిక సమర్పిస్తారని సమాచారం. కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరక్టర్‌ అశ్వనీకుమార్‌ వర్మ, డిజైన్ల చీఫ్‌ ఇంజినీరు విజయ్‌ శరణ్, పోలవరం అథారిటీకి చెందిన రఘురామ్, జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, పోలవరం ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహమూర్తి తదితరులు నిపుణుల వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని