Polavaram: పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Published : 01 Jul 2024 05:32 IST

తొలి రోజు ఆరుగంటల పాటు క్షేత్రస్థాయిలో..

ఎగువ కాఫర్‌డ్యాం గురించి నిపుణులకు వివరిస్తున్న సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఆశ్వినీకుమార్‌వర్మ 

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిచర్డ్‌ డోనెల్లీ, గియాస్‌ ఫ్రాంకో డీ సిస్కో, సీస్, డేవిడ్‌ బి.పాల్‌తో కూడిన బృందం ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంలు, గ్యాప్‌-1, డయాఫ్రం వాల్‌ నిర్మాణాలను పరిశీలించింది. ఉదయం పది గంటలకు పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారు.. కొద్దిసేపు రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఇన్‌ఛార్జి సీఈ, ప్రస్తుత ఎస్‌ఈ కె.నరసింహమూర్తితో భేటీ అయ్యి పనుల వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి స్పిల్‌వేకు చేరుకుని ప్రాజెక్టు మ్యాప్‌ పరిశీలించారు. అనంతరం ఎగువ కాఫర్‌డ్యాంపైకి చేరుకున్న వారికి.. గతంలో జరిగిన పనులు, ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ సమయంలో తీసిన ఫొటోలతో పాటు సాంకేతిక వివరాలను సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఆశ్వినీకుమార్‌వర్మ వివరించారు. 

ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ నిపుణులు

నమూనాల పరిశీలన

ఎగువ కాఫర్‌ డ్యాంపై మూడుచోట్ల జరుగుతున్న జియో టెక్నికల్‌ కోర్‌ ఇన్వెస్టిగేషన్‌ పనులు, అక్కడ తీసిన మట్టి నమూనాలను నిపుణుల బృందం పరిశీలించింది. తిరిగి దిగువ కాఫర్‌ డ్యాంను సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన ఫొటోలు, సాంకేతిక వివరాలను పరిశీలించి మధ్యాహ్నం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజన విరామం అనంతరం గ్యాప్‌-1 నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. 

నేడు డయాఫ్రం వాల్‌ పరిశీలన 

అంతర్జాతీయ నిపుణులు సోమవారం డయాఫ్రం వాల్‌ నిర్మాణం పరిశీలిస్తారని జలవనరుల శాఖాధికారులు తెలిపారు. డయాఫ్రం వాల్‌ ఎక్కడెక్కడ దెబ్బతింది, ప్రస్తుత స్థితి ఏంటి అన్నదానిపై అధ్యయనం చేయడంతో పాటు సంబంధిత సంస్థల ప్రతినిధులతో సమీక్షించే అవకాశం ఉందని పేర్కొన్నారు.


ముందే కొంత కసరత్తు

ఈనాడు, అమరావతి, పోలవరం, న్యూస్‌టుడే: ప్రాజెక్టు వద్దకు రావడానికి ముందే అంతర్జాతీయ నిపుణులు ఇక్కడి సవాళ్లపై ప్రాథమికంగా కొంత అవగాహన కల్పించుకున్నారు. దిల్లీలో శనివారం తొలి భేటీ జరిగింది. కేంద్రజలసంఘంలోని కొందరు ముఖ్యులతో పాటు పోలవరం ప్రాజెక్టు ఇన్‌ఛార్జి సీఈ నరసింహమూర్తి అక్కడ ఈ నిపుణులకు ప్రజంటేషన్‌ సమర్పించారు. ప్రస్తుతం సవాళ్లు ఎదురైన కట్టడాల నిర్మాణ షెడ్యూలు, సమగ్ర సమాచారంపై వారు ఆసక్తి కనబరిచారు. అన్ని అంశాలపైన కొంత కసరత్తు చేసి ఆదివారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. తొలి రోజు ప్రధానంగా స్పిల్‌ వే, ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం పరిశీలించారు. వాళ్లు పరిశీలిస్తున్నప్పుడు సమయంలో స్థానిక ఇంజినీరింగ్‌ అధికారులు కూడా వారి నుంచి సలహాలు కోరారు. గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం పనులు చేసుకునేందుకు కొంత వెసులుబాటు ఉందనే భావనతో ఆ విషయంపై స్థానిక అధికారులు నిపుణులతో చర్చించారు. 

పట్టిసీమ ఎత్తిపోతల వద్ద 13.78 మీటర్లు

 కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి నీరు చేరడంతో పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం 13.78 మీటర్లకు చేరినట్లు పర్యవేక్షణ డీఈ పెద్ద్దిరాజు తెలిపారు. నదిలో క్రమంగా నీరు పెరిగితే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఎత్తిపోతల పంపులు ప్రారంభిస్తామని డీఈ పేర్కొన్నారు. పట్టిసీమ నీటి కోసం పోలవరం కుడికాలువ పరిధిలోని గ్రామాలవారితో పాటు కృష్ణాడెల్టా వాసులు ఎదురు చూస్తున్నారు. నీరు వదిలితే వరి నారుమడులు పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని