MVV Satyanarayana: మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో విశాఖపట్నం ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో నమోదయిన కేసు విషయంలో వైకాపా నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Updated : 26 Jun 2024 06:57 IST

హయగ్రీవ భూముల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వలేమన్న కోర్టు

ఈనాడు, అమరావతి: హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో విశాఖపట్నం ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో నమోదయిన కేసు విషయంలో వైకాపా నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు ఎఫ్‌ఐఆర్‌ దశలో ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఓయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకొని విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని తమ విలువైన భూములు కాజేసేందుకు ప్రయత్నించారంటూ హయగ్రీవ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన సీహెచ్‌ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆరిలోవ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. దీనిలో తనపై నమోదయిన కేసును కొట్టేయాలని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. సివిల్‌ వివాదాన్ని క్రిమినల్‌ కేసుగా మార్చడానికి వీల్లేదన్నారు. అరెస్టు నుంచి పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని కోరారు. ఈ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని