Eenadu MD kiran: నాన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం

‘ప్రజాశ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువల కోసం జీవితాంతం మా నాన్నగారు రామోజీరావు పరితపించారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను మేం భావిస్తున్నాం.

Published : 28 Jun 2024 06:46 IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కల
ఆ నగర నిర్మాణానికి రూ. 10 కోట్ల విరాళం
‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌ కిరణ్‌ వెల్లడి

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.10 కోట్ల చెక్కును చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు అందిస్తున్న
రామోజీరావు కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజాకిరణ్, విజయేశ్వరి

ఈనాడు, అమరావతి: ‘ప్రజాశ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువల కోసం జీవితాంతం మా నాన్నగారు రామోజీరావు పరితపించారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను మేం భావిస్తున్నాం. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరం సభాముఖంగా మాట ఇస్తున్నాం. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవో.. కావో చూడాలని ఎప్పుడూ ఆయన చెప్పేవారు. ఆ కృషిని కొనసాగిస్తాం’ అని ‘ఈనాడు’ మేనేజింగ్‌ డైరక్టర్‌ సీహెచ్‌ కిరణ్‌ ప్రకటించారు. ‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఒక ఐకానిక్‌ నగరంగా రూపొందాలనేది ఆయన కల.  

రామోజీరావు ఆకాంక్షలకు అనుగుణంగా నూతన నగరం అమరావతి అపురూపంగా తయారై యావత్‌ దేశానికే కీర్తి ప్రతిష్ఠలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరఫున ఈ నగర నిర్మాణానికి రూ. 10 కోట్లు విరాళంగా అందజేస్తున్నాం’ అని వెల్లడించారు. తన తండ్రి ఆలోచనా విధానాన్ని, అనేక రంగాల్లో ఆయన కృషిని కిరణ్‌ వివరించారు.  

పౌరులకు రక్షాకవచం 

‘రామోజీరావు ప్రచారాన్ని ఇష్టపడే వారు కాదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు రక్షించడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు. పౌరులు ఇబ్బందులు పడుతుంటే వారికి రక్షాకవచంగా నిలిచేవారు. ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడు బాధితుల పక్షాన నిలిచేవారు. ఎక్కడ ఏ ఉపద్రవమొచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. ఏ గొప్ప సంస్థయినా ఒక మహామనిషి  (లెజండరీ) నీడలో విస్తరిస్తుంది. ‘ఈనాడు’ గ్రూపు సంస్థలు కూడా రామోజీరావు అనే ఒక యుగపురుషుడి నీడలో వేళ్లూనుకున్నాయి. జీవితాంతం ఆయన ప్రజాసంక్షేమం, ప్రజా జీవనంలో విలువల కోసం ఒక యోధుడిలా పని చేశారు. ఐదు దశాబ్దాలుగా రామోజీరావు ప్రజావ్యతిరేక అంశాలను ఎదుర్కొనేందుకు ఎంతటి కష్టనష్టాలకైనా సిద్ధపడేవారు. దేశంలో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా నిలిచేవారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేవారు’ అని కిరణ్‌ వివరించారు. 

మాట్లాడుతున్న ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌

రాజధానికి పేరు పెట్టింది ఆయనే.. 

‘‘నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరును సూచించింది రామోజీరావే. కృష్ణమ్మ ఒడ్డున రాజధాని నగరం అద్భుతంగా రూపుదిద్దుకోవాలని బలంగా ఆకాంక్షించారు. చంద్రబాబునాయుడు ఆహ్వానంపై శంకుస్థాపన కార్యక్రమానికి కూడా వచ్చి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ కల నెరవేరాలని మా కుటుంబం తరఫున రూ. 10 కోట్ల విరాళం అందిస్తున్నాం. రామోజీరావు గతంలో ఏం చేశాం అనేది ఎప్పుడూ చూసేవారు కాదు. ఎప్పుడూ ఆయనది ముందుచూపే. కలలు నిజం చేసుకోవాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలని, చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన నమ్మేవారు. ఈ సభను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంత తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించింది. ఎంతో దూరం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చి మా కుటుంబానికి అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు’ అని కిరణ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని