Pawan Kalyan: ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్‌

‘‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐదేళ్లలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకాపా ప్రభుత్వం కనీసం ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదు. పోలీసులూ స్పందించలేదు.

Published : 03 Jul 2024 05:12 IST

30 వేలమంది కనిపించకపోతే వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నంబర్‌ 1గా ఉండాలి
కాకినాడలోని కీలక శాఖల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

సమీక్షలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌. చిత్రంలో ఎంపీ 
ఉదయ్‌ శ్రీనివాస్, కలెక్టర్‌ షాన్‌ మోహన్‌

ఈనాడు, కాకినాడ: ‘‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐదేళ్లలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకాపా ప్రభుత్వం కనీసం ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదు. పోలీసులూ స్పందించలేదు. ఆడబిడ్డలు దూరమై ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. భీమవరానికి చెందిన ఓ బాలికను ప్రేమపేరుతో మోసపుచ్చి తొమ్మిది నెలల క్రితం తీసుకెళ్లారని ఓ తల్లి ఏడుస్తూ చెప్పారు. దీనిపై పరిశోధన చేయాలని విజయవాడ పోలీసులను కోరితే వెంటనే స్పందించారు. దర్యాప్తు చేసి బాలిక జమ్మూకశ్మీర్‌లో ఉందని 72 గంటల్లోపే గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఒక ప్రభుత్వం అనుకుంటే చేయగలదన్నదానికి ఇదో నిదర్శనం. హ్యాట్సాఫ్‌ ఏపీ పోలీస్‌. ఈ సమస్యపై ఏం చేయాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. తక్షణమే స్పందించేలా ప్రత్యేకసెల్‌ ఏర్పాటుకు ఆలోచన చేస్తాం’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. కాకినాడలో పలు శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసినా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వలేదు. ఆర్థికసంఘం నిధులూ దారి మళ్లించింది. పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ఆర్థికపరిస్థితి సన్నగిల్లింది. సమస్యను మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి కార్యాచరణ రూపొందిస్తాం. ఉన్నతస్థాయి కమిటీ వేసి పంచాయతీల బలోపేతంపై దృష్టి సారిస్తాం. ఇసుక, మట్టి, గనుల తవ్వకాల నుంచి సీనరేజి.. రిజిస్ట్రేషన్లు, ఇతర పన్నుల ద్వారా పంచాయతీలకు రావల్సిన నిధులు గత ప్రభుత్వంలో అందలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలపైనే ఏడాదికి రూ.వెయ్యి కోట్లు రావాలి. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా స్థానిక సంస్థలకు రావల్సిన వాటా రాలేదు’’ అని చెప్పారు. ఏ శాఖ నుంచి స్థానిక సంస్థలకు ఎంత అందాలో పూర్తిస్థాయి నివేదిక 48 గంటల్లో ఇవ్వాలని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ను ఆదేశించారు.

నేడు ఉప్పాడ తీరానికి నిపుణులు

వాతావరణంలో విపరీతమైన మార్పులతో సమస్యలు వస్తున్నాయని మంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. 974 కి.మీ. తీరప్రాంతంపై ప్రభావం పడుతోందన్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం 20 అడుగులు ముందుకొచ్చి, నివాసాలను కలిపేసుకుంటోందని చెప్పారు. ఏడాదిన్నరలో ఎకరం ముందుకొచ్చిందని తెలిపారు. దీనిపై చెన్నైకి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ బృందం బుధవారం ఉప్పాడతీరాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. 

శాస్త్ర-సాంకేతికతకు ప్రోత్సాహం 

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతో పాటు ఇతర శాఖల్లో ఖాళీల భర్తీపై దృష్టి సారిస్తున్నామని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ విజ్ఞానకేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కోనసీమ కొబ్బరి పరిశోధన కేంద్రంతో పాటు కొబ్బరి ఆధారిత అనుబంధ రంగాలపై దృష్టి పెడతామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని