Ramoji Rao: నిజాయతీ, నిర్భీతి మూర్తీభవించిన రామోజీ

సొంత కుటుంబసభ్యుల్ని బెదిరించినా పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు రాజీపడకుండా నిలబడ్డ గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు.

Updated : 28 Jun 2024 06:39 IST

పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు కుటుంబాన్నీ పణంగా పెట్టారు
వ్యాపారాలపై దాడులు చేస్తున్నా వెనకడుగు వేయలేదు
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

సొంత కుటుంబసభ్యుల్ని బెదిరించినా పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు రాజీపడకుండా నిలబడ్డ గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఎవరైనా వారి కుటుంబసభ్యులకు ఇబ్బందులు తలెత్తితే నలిగిపోతారని.. రామోజీరావు మాత్రం వాటన్నింటినీ దాటుకుని ‘ఏది జరిగితే అది జరగనీ’ అంటూ ప్రజల కోసం నిర్భీతిగా, నిజాయతీగా నిలబడ్డారని ప్రశంసించారు. కుటుంబాన్ని పణంగా పెట్టి, అలా వెనక్కి తగ్గకుండా ఉండటానికి ఎంతో సాహసం కావాలని చెప్పారు. ‘విలువలు, అంకితభావంతో పత్రికాధిపతిగా కొనసాగుతూనే.. ఇతర వ్యాపారాలు చేస్తుంటే వాటిపై దాడులు చేయటం గిట్టని వారికి చాలా తేలిక. కానీ రామోజీరావు మాత్రం అలాంటి దాడులన్నింటినీ తట్టుకుంటూ పాత్రికేయుడిగా, పత్రికాధిపతిగా రాజీపడని ధోరణితోనే నడిచారు. ఆయన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. ఆయన నష్టపోవటానికైనా సిద్ధమయ్యారే తప్ప వెనకడుగు వేయలేదు’ అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తిమంతమైన పాత్రికేయుడి విగ్రహాన్ని నెలకొల్పాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

ఎన్నికల్లో విజయ వార్త విన్నారా.. అని వాకబు చేశా

ఎన్నికల ఫలితాలు రావటానికి కొద్ది రోజుల ముందు రామోజీరావు ఆరోగ్యం క్షీణిస్తోందనే సమాచారం వచ్చింది. అరాచక పాలకులపై అంతులేని పోరాటం చేసిన ఆయన ఆ విజయవార్త వింటారా లేదా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ని. ‘ఆయన పరమపదించే ముందు ఎన్నికల్లో ప్రజాస్వామ్య విజయవార్తను విన్నారా? అది ఆయన చెవిన పడిందా?’ అని రామోజీరావు కుటుంబసభ్యుల్ని వాకబు చేశా. ఈ విజయాన్ని 24 గంటలపాటు ఆయన సంపూర్ణంగా ఆస్వాదించారని వారు చెప్పారు. పోరాట ఫలితాన్ని చూశాక, తెలుసుకున్నాకే ఆయన పరమపదించటం తృప్తినిచ్చింది. 

సమాచార హక్కు ఉద్యమకారుడు

ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రతిదీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ఉద్యమాన్ని రామోజీరావు ‘ఈనాడు’ పత్రిక ద్వారా ముందుండి నడిపించారు. ప్రజలకు అండగా ఆయన చేసిన మహాయజ్ఞం చాలా జటిలమైనది. పత్రికా రంగంలోనే కాకుండా సినిమా నిర్మాణం సహా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు.


ఎవరైనా సరే ప్రజల తర్వాతే.. 

జనం కోసం నిలబడే విషయంలో ఆయన నిర్ధాక్షిణ్యంగా, నిష్పక్షపాతంగా ఉండేవారు. పరిచయస్తులు, స్నేహితులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఎవరైనా సరే ఆయనకు ప్రజల తర్వాతే. ఆ ఆలోచన ధోరణే ‘ఈనాడు’లో ప్రతిబింబించేది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రామోజీరావు పరితపించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆయన స్థాపించిన ఈనాడు, ఈటీవీ సంస్థలు.. వార్తలు, కథనాల సమర్పణలో తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉంటాయి. చేసే పనిని బట్టే గుర్తిస్తాయి తప్ప ఎవరి పట్లా ప్రత్యేక అభిమానం ప్రదర్శించవు. తెదేపా, కాంగ్రెస్‌ ఇలా ఏ పార్టీ అయినా సరే వాళ్లు మంచి చేస్తే మంచి చేశారని, చెడు చేస్తే చెడు చేశారనే వార్తలిస్తాయి. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి సంఘటనలు, అంశాలనైనా సరే మొదటి పేజీలో ప్రాధాన్యతతో ప్రచురిస్తాయి. రామోజీరావు పాత్రికేయ వారసత్వ ప్రవాహాన్ని ప్రతి పాత్రికేయుడూ పుణికిపుచ్చుకోవాలి. ఆయనది అపరిమితమైన, అవిశ్రాంత, ఉద్ధృత ప్రవాహం. దానిలో నుంచి మనం ఎంతో తోడుకోగలమో అంతా తీసుకోవాలి. తెలుగు ప్రజలందరూ ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. 


నమ్మినదాన్నే త్రికరణశుద్ధిగా ఆచరించాలని నాతో చెప్పారు

నేను రాజకీయాల్లోకి వచ్చాక 2008లో మొట్టమొదటిసారి రామోజీరావును కలిశాను. ఆయన మాట్లాడే విధానం నిక్కచ్చిగా ఉంటుంది. ప్రజల పక్షపాతి. మాట్లాడుతున్నంతసేపూ.. పాత్రికేయ విలువల్ని కాపాడటానికే ఆయన ఉన్నారనిపించింది. ప్రజా క్షేమం, ప్రజా సంక్షేమం కోణంలోనే మా మధ్య చర్చ జరిగింది. 2019లో వారి కుటుంబసభ్యులతో కలిసి నన్ను భోజనానికి ఆహ్వానించారు. దేశ పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎంత కీలకమో చెబుతుంటే ఆయన మాటల్లోని ఆవేదన నాకు కనిపించింది. ‘మీరు వర్ధమాన రాజకీయ నాయకులు. మీకు ఆల్‌ ద బెస్ట్‌. జీవితంలో ఏ విషయంలోనూ రాజీపడొద్దు. ఏదైతే నమ్ముతారో దాన్ని త్రికరణ శుద్ధిగా చెయ్యండి’ అని నాకు ఉద్బోధించారు. అలాంటి మహానుభావుడి సంస్మరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా రావటం ఆనందంగా ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని