Pawan Kalyan: ఓ వైపు శాఖల సమీక్షలు.. మరోవైపు ప్రజల సమస్యలు

ఒక వైపు తనకు సంబంధించిన శాఖల సమీక్షలను నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు.

Published : 29 Jun 2024 03:56 IST

నేరుగా విజ్ఞప్తులను స్వీకరించిన  ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ 

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మంగళగిరిలోని తన నివాసంలో  నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ఒక వైపు తనకు సంబంధించిన శాఖల సమీక్షలను నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. సమస్యల వినతిపత్రాలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి శుక్రవారం ప్రజలు పోటెత్తడంతో స్వయంగా ఆయనే వాటిని తీసుకున్నారు. బాధితులతో నేరుగా మాట్లాడి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పవన్‌ దృష్టికి వచ్చిన పలు సమస్యలు ఇవి..

  • ప్రమాదవశాత్తు ఇళ్లు కాలిపోవడంతో తన కుమార్తె ధ్రువపత్రాలతో పాటు ఆమె చదువుకోసం దాచిపెట్టిన డబ్బులు బూడిదయ్యాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. కుమార్తె చదువుకోసం సాయం అందించాలని కోరారు. 
  • ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్, క్రాఫ్ట్, సంగీత ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ట్, క్రాఫ్ట్‌ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 1986 నుంచి ఈ పోస్టుల భర్తీ చేయడం లేదని పవన్‌ దృష్టికి తీసుకెళ్లింది.
  • ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నుంచి 1,143 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది కోరారు. తమకు 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, పొరుగుసేవల ఉపాధ్యాయ వ్యవస్థకు ఒప్పంద గురుకుల ఉపాధ్యాయులు అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. 
  • పలువురు దివ్యాంగులు వారి సమస్యలను చెప్పేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరి నుంచి పవన్‌కల్యాణ్‌ నేరుగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ 

మల్యాల, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక భద్రత ఎస్పీ అర్జున్‌ శుక్రవారం మధ్యాహ్నం కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని