Chandra babu: రాజకీయ ప్రేరేపిత రౌడీషీట్లు ఎత్తేయండి

వైకాపా ఐదేళ్ల పాలనలో తెదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీషీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Updated : 27 Jun 2024 06:59 IST

రాష్ట్రంలో నేరాల శాతం సున్నాగా ఉండాలి
అధికారులు వేగంగా, సమర్థంగా పనిచేయాలి
కుప్పంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు 

అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, చిత్తూరు: వైకాపా ఐదేళ్ల పాలనలో తెదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీషీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిజమైన రౌడీషీటర్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నేరాల శాతం సున్నాగా ఉండాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు బుధవారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గుడుపల్లె మండలం నలగంపల్లెలోని డిగ్రీ కళాశాలలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2019 ఎన్నికలకు ముందు నాపై ఎటువంటి కేసులు లేవు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏకంగా 22 కేసులు నమోదు చేశారు.  

అందులో రెండు హత్యాయత్నం ఘటనలూ ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలకు తలొగ్గే పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. ఐదేళ్లలో కొందరు అధికారులు మనసు చంపుకొని పనిచేశారు. వైకాపా నేతల పైశాచికానందానికి సహకరించారు. చివరకు నా సొంత నియోజకవర్గం కుప్పానికీ రాలేని పరిస్థితిని కల్పించారు. రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు తెలుగుదేశం శ్రేణులపై రౌడీషీట్లు తెరిచారు. వ్యవస్థలు విధ్వంసం కావడాన్ని చూసి చాలా బాధపడ్డా. కూటమి పాలనలో ఎవరిపైనా అనవసరంగా కేసులు పెట్టొద్దు.. రౌడీషీట్లు తెరవద్దు. రాజకీయ ప్రోద్బలంతో తెలుగుదేశం శ్రేణులపై పెట్టిన షీట్లను ఎత్తేయండి’ అని పోలీసులను ఆదేశించారు.  

పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం

రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టానని చంద్రబాబు చెప్పారు. తొలి అడుగు ఇక్కడి నుంచే పడాలని ఆకాంక్షించారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఏయే పనులు చేయాలి? ఎంత నిధులు అవసరం? ఎంత సమయం పడుతుందో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్, జేసీ శ్రీనివాసులును ఆదేశించారు. అభివృద్ధిలో దేశానికే కుప్పం తలమానికంగా ఉండాలని, నెలల వ్యవధిలోనే ఇక్కడ మార్పు కనిపించాలని నిర్దేశించారు. కుప్పం ప్రజల ఆర్థిక స్థితిని సర్వే ద్వారా తెలుసుకుని, వారి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. 


సింపుల్‌ గవర్నమెంట్‌.. ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌

‘గత ప్రభుత్వ పాలనకు.. ఇప్పటి పాలనకు చాలా వ్యత్యాసం ఉండబోతోంది. వైకాపా హయాంలో మాదిరిగా బలవంతపు జనసమీకరణతో పెద్దపెద్ద సమావేశాలు, భారీ కాన్వాయ్‌లతో సైరన్ల మోత, హంగామా ఇప్పుడు ఉండవు. సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకూ చెప్పా. సింపుల్‌ గవర్నమెంట్‌.. ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ నా విధానం. సాంకేతికతను అధికారులు అందిపుచ్చుకోవాలి. భౌతిక, వర్చువల్‌ పని విధానానికి సిద్ధంగా ఉండాలి. వేగంగా, సమర్థంగా పనిచేయాలి. ప్రజల వినతులు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. డ్వాక్రా మహిళలను లక్షాధికారులుగా ఎలా చేయాలో నేను ఆలోచిస్తున్నా. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి   చెందిన దేశంగా అవతరించేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందించారు. దానికి దశాబ్దానికి ముందే ఆంధ్రప్రదేశ్‌లో ఈ లక్ష్యాన్ని సాధించాలి. మనిషి తలచుకోవాలే కానీ అసాధ్యమన్నదే లేదు. అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని పనిచేయాలి. వైకాపా పాలనలో రైతులకు బిందు, తుంపర సేద్యం పరికరాలు ఇవ్వలేదు. దీంతో అన్నదాతలు నష్టపోయారు. కూటమి హయాంలో కర్షకులకు అండగా ఉంటాం. సౌర, పవన విద్యుత్తును ప్రోత్సహించి ప్రజలే విద్యుత్తు అమ్మేలా చర్యలు తీసుకుంటాం. తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది’ అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. 


పోలీసులకు తొలగని వైకాపా వాసనలు

చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కుప్పంలో ప్రజలు, తెదేపా కార్యకర్తలు స్వేచ్ఛగా ఆయన్ను కలుసుకుని సమస్యలు చెప్పుకొనేవారు. ప్రస్తుత పర్యటనలో మాత్రం కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపారు. జగన్‌ పాలన నాటి వాసనలను ఇంకా తొలగించుకోలేదు. కుప్పంలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో సైతం తాను ప్రయాణిస్తున్నా పక్కనే సామాన్యులు వాహనంలో వెళ్లే వ్యవస్థ ఉండాలని పోలీసులకు సూచించినా వారిలో మార్పు రాలేదు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వాలని తరలివచ్చిన వందల మందికి పోలీసులు ఆటంకం కలిగించారు. దీంతో ముఖ్యమంత్రిని కలవడం ప్రజలకు కష్టంగా మారి, చాలా మంది కలెక్టర్‌కే వినతులు ఇచ్చారు. డిగ్రీ కళాశాల, పీఈఎస్‌ కళాశాల వద్ద సైతం పోలీసులు ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించారు.


పనిచేసే కార్యకర్తలకే పదవులు

కుప్పంలో తెదేపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

అనంతరం పీఈఎస్‌ వైద్య కళాశాలలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ‘నా వెంట తిరిగే వారికి కాకుండా పనిచేసే కార్యకర్తలకు పదవులు ఇస్తా. కులమతాల పట్టింపు లేకుండా ప్రోత్సహిస్తా. గత ఐదేళ్లలో ఎవరెవరిపై కేసులు పెట్టారో.. ఆ వివరాలు అందిస్తే చట్టపరంగా తొలగించేందుకు పార్టీపరంగా ప్రయత్నిస్తా. భవిష్యత్తులో వైకాపా నాయకులు తెలుగుదేశం కార్యకర్తల జోలికి రావాలంటేనే భయపడేలా చేస్తా. 2029 ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ సాధించేందుకు అంతా కృషి చేయాలి’ అని తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సాయంత్రం ఆయన విజయవాడ బయలుదేరి వెళ్లారు. కార్యక్రమాల్లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్, భానుప్రకాష్, నాయకులు దొరబాబు, సీఆర్‌ రాజన్, శ్రీధర్‌వర్మ, పెందుర్తి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన తెదేపా నాయకులు, కార్యకర్తలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని