Amaravati: అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు

ఐదేళ్ల జగన్‌ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది.

Updated : 30 Jun 2024 06:59 IST

పరిపాలన నగరం మాస్టర్‌ప్లాన్‌ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ఐదేళ్ల జగన్‌ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. రాజధాని బృహత్‌ ప్రణాళికలో భాగంగా 1,575 ఎకరాల్లో ప్రతిపాదించిన అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (పరిపాలన నగరం) మాస్టర్‌ ప్లాన్, జోనింగ్‌ రెగ్యులేషన్‌ ప్లాన్‌లు, అర్బన్‌ డిజైన్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం శనివారం నోటిఫై చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అమరావతి బృహత్‌ ప్రణాళికకు... 2019లో ఎన్నికలకు ముందే ప్రభుత్వ ఆమోదం లభించినా, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. పరిపాలన నగరంలో తెదేపా ప్రభుత్వ హయాంలోనే హైకోర్టు నిర్మాణం పూర్తిచేశారు. కొన్నేళ్లుగా హైకోర్టు అక్కడి నుంచే పనిచేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం చేపట్టిన అపార్ట్‌మెంట్‌ టవర్ల నిర్మాణ పనులు జగన్‌ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయాయి. హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారుల నివాస భవనాల నిర్మాణ పనులూ ఆగిపోయాయి. ఆ ప్రాంతాలు అడవిని తలపిస్తున్నాయి. సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయ భవనాలకు, హైకోర్టు ఐకానిక్‌ భవనాలకు వేసిన పునాదులు ఐదేళ్లుగా నీళ్లలో నానుతున్నాయి. రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానిలో భాగంగానే పరిపాలన నగరం మాస్టర్‌ప్లాన్‌ను నోటిఫై చేసింది. రాజధానిలోని రాయపూడి, శాఖమూరు, నేలపాడు, లింగాయపాలెం, కొండమరాజుపాలెం వంటి గ్రామాల పరిధిలోని భూముల్లో పరిపాలన నగర నిర్మాణం జరుగుతోంది. ఆ భూముల సర్వే నంబర్లు సహా... పరిపాలన నగర సరిహద్దుల్ని ప్రభుత్వం నోటిఫై చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని