Rushikonda: ‘రుషికొండ’ నిర్మాణ సంస్థ సర్దేసుకుందా?

పర్యాటక రిసార్టు పేరుతో జగన్‌ విశాఖలోని రుషికొండ మీద నిర్మించుకున్న ప్యాలెస్‌లలో ఇంకా ఇంటీరియర్, ఫర్నిచర్‌ పనులు మిగిలున్నాయి.

Updated : 26 Jun 2024 11:40 IST

ఇంకా మిగిలే ఉన్న తుది దశ పనులు

గతంలో ఇక్కడే గుత్తేదారు సంస్థ కార్యాలయాలు ఉండేవి

ఈనాడు, విశాఖపట్నం: పర్యాటక రిసార్టు పేరుతో జగన్‌ విశాఖలోని రుషికొండ మీద నిర్మించుకున్న ప్యాలెస్‌లలో ఇంకా ఇంటీరియర్, ఫర్నిచర్‌ పనులు మిగిలున్నాయి. మళ్లీ వైకాపా ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో వాటిని నెమ్మదిగా సాగించారు. ఈ ఏడాది నవంబరు 14 నాటికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టు అప్పగింతకు గుత్తేదారు సంస్థతో నాడు ఒప్పందం చేసుకున్నారు. తొలి గడువు ముగిసినా, చివరిదశ పనుల కోసం పొడిగించుకున్నట్లు సమాచారం. చేయాల్సిన పనులున్నా ఆ ప్రాజెక్టు గుత్తేదారు సంస్థ క్యాంపు కార్యాలయాన్ని రుషికొండ నుంచి తరలించేసింది. 

కనిపించని కార్యాలయం: రుషికొండ మీద జగన్‌ కోసం రాజసౌధాల నిర్మాణ పనులను వైకాపా నేతకు చెందిన ఓ గుత్తేదారు సంస్థే చేపట్టింది. కొండను   బోడిగుండు చేయడం మొదలుకొని చివరగా చేపట్టిన ఇంటీరియర్, ఫర్నిచర్‌ కొనుగోలు పనులూ అదే సంస్థ ద్వారా జరిగాయి. ఇప్పటికే ఆ సంస్థకు రూ.400 కోట్లకుపైగా బిల్లులు చెల్లించారు. గతంలో కంటెయినర్లలో ఉన్న తాత్కాలిక కార్యాలయాన్నీ తరలించేశారు. 

కొండమీద నాలుగు బ్లాకుల్లో ఏడు ప్యాలెస్‌లను నిర్మించగా వాటిలో ఫర్నిచర్‌ పనులు జరగాల్సి ఉంది. జగన్‌ కోసమని నిర్మించిన విజయనగర ప్యాలెస్‌-1, 2, 3లలో ఫర్నిచర్‌ ఏర్పాటుచేయాలి. 

కేసుపై నెలాఖరుకు స్పష్టత: రుషికొండ ప్రాజెక్టుపై హైకోర్టు, ఎన్జీటీలలో కేసులు నడుస్తున్నాయి. అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు నిపుణుల కమిటీ నివేదికను చూస్తే స్పష్టమవుతుందని ఇప్పటికే హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ (ఎంఓఈఎఫ్‌) మరో కమిటీని నియమించింది. అది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి చర్యలపై నివేదిక సమర్పించే సమయంలో ఆ కమిటీ ఛైర్మన్‌ ఆకస్మికంగా మృతిచెందారు. ఈ నెలాఖరుకు   ఆ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిశీలించాక హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని