అలాగే.. 6న కలుద్దాం

విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Updated : 03 Jul 2024 06:41 IST

ప్రజాభవన్‌కు ఆహ్వానిస్తూ చంద్రబాబుకు సీఎం రేవంత్‌ లేఖ
విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చేసిన ప్రతిపాదనకు స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్‌లో చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు చంద్రబాబుకు మంగళవారం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ‘‘విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు జరపాలంటూ లేఖ రాసినందుకు మీకు ధన్యవాదాలు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించినందుకు అభినందనలు. స్వతంత్ర భారతదేశంలో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన అతికొద్ది మంది రాజకీయ నేతల సరసన మీరూ చేరడం సంతోషకరం. ఏపీ సీఎంగా మీరు ఈ విడతలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మనం ముఖాముఖి చర్చించాలన్న మీ సూచనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. విభజన చట్టానికి సంబంధించిన అంశాల పరిష్కారం అత్యవసరం. రెండు రాష్ట్రాల ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకు, పరస్పర ఆలోచనలు పంచుకొని సహకరించుకునేందుకు ముఖాముఖి సమావేశం తప్పనిసరి. ఈ నెల 6న మధ్యాహ్నం ప్రజాభవన్‌లో ముఖాముఖి చర్చలకు రావాల్సిందిగా తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను’’ అని చంద్రబాబుకు రాసిన లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని