Andhra News: బందోబస్తుకు ఆలస్యంగా వచ్చారని ఎస్‌ఐపై మంత్రి భార్య ఆగ్రహం

మంత్రుల పర్యటనల్లో ఆడంబరాలు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా ఓ మంత్రి భార్య పోలీసులపై మండిపడటం.. ఏకవచనంతో సంబోధించడం వివాదాస్పదమైంది.

Published : 02 Jul 2024 04:46 IST

జీతం వైకాపా వాళ్లు ఇస్తున్నారా.. అంటూ మండిపాటు

ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి భార్య 

ఈనాడు, కడప: మంత్రుల పర్యటనల్లో ఆడంబరాలు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా ఓ మంత్రి భార్య పోలీసులపై మండిపడటం.. ఏకవచనంతో సంబోధించడం వివాదాస్పదమైంది. ఆ ఘటన ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయివారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో సోమవారం పింఛన్ల పంపిణీ సందర్భంగా రవాణాశాఖ మంత్రి, రాయచోటి ఎమ్మెల్యే రామ్‌ప్రసాదరెడ్డి భార్య హరితారెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం ఆరు గంటలకే బయల్దేరిన ఆమె చిన్నమండెం మండలం దేవగుడిపల్లె వద్దకు చేరుకున్నారు. అప్పటికి అక్కడున్న కానిస్టేబుళ్లు.. ఎస్‌ఐ రమేష్‌బాబు వస్తున్నారని, వేచి ఉండాలని చెప్పారు. సమస్యాత్మక గ్రామాలకు బందోబస్తు లేకుండా వెళ్లవద్దని సూచించారు. ఆమె కారులోనే నిరీక్షించారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న ఎస్‌ఐపై ఆమె మండిపడుతూ.. ‘తెల్లారిందా? మేం ఏ టైమ్‌కి చేరుకున్నామో తెలుసా?’ అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. కాన్ఫరెన్స్‌ ఉందని, అందుకే ఆలస్యమైందని ఎస్‌ఐ చెబుతుండగా.. ‘ఏం కాన్ఫరెన్స్‌... సీఐకి లేని కాన్ఫరెన్స్‌ నీకుందా? పెళ్లికొచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని తెలీదా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దానికాయన పొరపాటైందని, సారీ చెబుతుంటే.. ‘దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా మీకు జీతమిస్తోంది? వైకాపా వాళ్లు ఏమైనా ఇస్తున్నారా? డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నానా? మీ కోసం అర్ధగంట నుంచి నిరీక్షిస్తున్నాం.. పదండి.. కాన్వాయ్‌ స్టార్ట్‌ చేయండి’ అంటూ ఆమె రుసరుసలాడారు. ఆమె పోలీసులపై మండిపడుతున్న వీడియో వివిధ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైంది. 

ఆమె తీరును తప్పుబట్టిన చంద్రబాబు: హరితారెడ్డి పోలీసులతో మాట్లాడిన విధానాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఆ ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల విషయంలో గౌరవంగా మసలుకోవాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టంచేశారు. ఆ ఘటనపై మంత్రి విచారం వ్యక్తంచేశారు. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని సీఎంకు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని