Chandrababu: మీ భద్రత మా బాధ్యత

సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Published : 30 Jun 2024 05:47 IST

మీ ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం
ఆర్థిక సమస్యలున్నా మీ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకున్నాం
పెంచిన పింఛనుతో ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నా
సామాజిక భద్రత పింఛనుదారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

ఈనాడు, అమరావతి: సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేస్తున్నామని తెలిపారు.  ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టు పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ.1000 పెంచామని, ఇకపై నెలనెలా రూ.4వేలు అందిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.3వేలు పెంచి ఇకనుంచి రూ.6వేలు అందిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరుతో ఇక పింఛన్లను అందించనున్నట్టు వివరించారు. పెంచిన పింఛను మొత్తాన్ని జులై 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక భద్రత పింఛనుదారులకు లేఖ రాశారు. అందులో సారాంశం ఆయన మాటల్లోనే..

మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఇది

‘మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు, ఆకాంక్షలతో మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా మీ ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 28 కేటగిరీలకు చెందిన 65,18,496 మంది లబ్ధిదారులకు జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. కొత్త ప్రభుత్వం ముందు ఆర్థిక సమస్యలున్నా... మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.

మీ కష్టాలు చూసి చలించిపోయా

‘ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికారపక్షం మిమ్మల్ని పింఛను విషయంలో ఎంతో క్షోభకు గురిచేసింది. ఆ మూడు నెలలు పింఛను తీసుకోడానికి మీరు పడిన కష్టాలు చూసి నేను చలించిపోయా. మండుటెండలో, వడగాలుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్‌ నుంచే పింఛను పెంపును వర్తింపజేస్తామని మాటిచ్చా. ఆ మాటను నెరవేరుస్తూ ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు పెంపును వర్తింపజేసి నగదు అందిస్తున్నాం. మూడు నెలలకు పెంచిన రూ.3 వేలు, జులై నెల పింఛను రూ.4వేలు కలిపి మొత్తం రూ.7వేలు మీ ఇంటివద్దకే తెచ్చి అందిస్తున్నాం’ అని వెల్లడించారు.

ఎన్నడూ లేని విధంగా పింఛన్ల పంపిణీ

‘పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై ఇకపై నెలకు రూ.819 కోట్ల భారం పడుతుంది. గడిచిన మూడు నెలలకు పెంపును వర్తింపజేేస్తామన్న హమీని నెరవేర్చేందుకు మరో రూ.1,650 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం. మీ శ్రేయస్సు కోసం ఆలోచించే మీ ప్రజాప్రభుత్వం.. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా జులై 1న రూ.4,408 కోట్లను పింఛన్ల రూపంలో మీకు అందిస్తోంది. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛను విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్‌ పేరుతో ‘ఎన్టీఆర్‌ భరోసా పథకం’గా సామాజిక భద్రత పింఛన్లు ఇకపై మీ ఇంటి వద్దే పంపిణీ చేస్తాం. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం. మీరు, మీ కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. మీకు ఎల్లప్పుడూ మంచి చేయాలని చూసే ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నా’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

పింఛను నగదుతో పాటు లేఖ

పింఛనుదారులకు సోమవారం పింఛను నగదుతో పాటు ఈ లేఖనూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందించనున్నారు. ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛను అమలు చేయనున్నందున పింఛనుదారులకు ఎంత పింఛను అందిందో తెలుసుకునేందుకు వారికి రసీదు కూడా ఇస్తారు. మరో రసీదులో లబ్ధిదారుల సంతకం తీసుకుని సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి నివేదించాలి. 


పింఛను పండగకు నగదు సిద్ధం

జులై ఒకటిన ‘సామాజిక పింఛను పంపిణీ’ పండగలా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30న ఆదివారం కావడం.. సోమవారమే పింఛను ఇవ్వాల్సి రావడంతో ఆయా గ్రామాలకు శనివారమే నగదు తరలింపు చేపట్టింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో అధికారులు శనివారం బ్యాంకు నుంచి నగదు డ్రా చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వాటిని తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జులై 1న రూ.7 వేల పింఛను అందజేయనున్నారు.

న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని