CM Chandrababu: రివర్స్‌ టెండర్లలో ఆదా వట్టిదే

‘‘జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్‌ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్‌ పనులు ఏవీ చేయలేదు.

Updated : 29 Jun 2024 07:13 IST

అదనపు పనులతో రూ.2,268 కోట్ల అదనపు భారం 
2019 వరదల్లో డయాఫ్రం వాల్‌కు ఏమీ కాలేదు
2020 వరదల్లోనే విధ్వంసం 
2023 వరకు నష్టంపై అధ్యయనమే లేదు 
పోలవరంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం 
2028 జూన్‌కు తొలిదశ పూర్తి

ఈనాడు, అమరావతి: ‘‘జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్‌ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్‌ పనులు ఏవీ చేయలేదు. గుత్తేదారును మార్చడం వల్ల రివర్స్‌ టెండర్లతో నిధులు ఆదా చేశామని చెబుతున్నా తర్వాత అదే గుత్తేదారుకు అదనపు పనులు ఇవ్వడంతో రూ.2,268 కోట్ల అదనపు భారం పడింది. సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం ఖాళీలను పూడ్చకపోవడంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యాం ప్రాంతం అగాధాలతో నిండిపోయింది. ప్రాజెక్టు విధ్వంసమైంది’’ అని పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన శ్వేతపత్రం పేర్కొంది. ‘‘2019 గోదావరి వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతినలేదు. 2020 భారీ వరదల్లోనే ఈ విధ్వంసం జరిగింది. కానీ 2023 జనవరి వరకూ దీనిపై అధ్యయనమే జరగలేదు’’ అని ఆ పత్రం వివరించింది. గుత్తేదారును మార్చకపోతే 2020 ఖరీఫ్‌ నాటికే తొలిదశ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవని పేర్కొంది. ‘‘ప్రస్తుతం తొలిదశలో +41.15 మీటర్ల స్థాయికి నీటిని నిలబెట్టి కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు 2028 జూన్‌ నాటికి అందించగలమని అంచనా వేస్తున్నాం’’ అని ప్రకటించింది. ఆ శ్వేతపత్రంలోని ఇతర అంశాలు ఇలా ఉన్నాయి.

  • జగన్‌ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు సివిల్‌ పనుల పురోగతి 3.84 శాతమే. ఎడమ, కుడి కాలువల్లో కొన్ని పెండింగు బిల్లుల చెల్లింపులు తప్ప ఏ పనీ జరగలేదు. పిల్ల కాలువల పనులూ ఇంకా ప్రారంభం కాలేదు. డీపీఆర్‌ కూడా ఖరారు కాలేదు.
  • నిధుల కేటాయింపులు, ఖర్చు అంతంతమాత్రమే. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలతో ముంపు వివాదాలు పరిష్కారం కాలేదు. 2017-18 ధరలకు అనుగుణంగా రెండో డీపీఆర్‌ ఆమోదంలోనూ పురోగతి లేదు.

గుత్తేదారు మార్పుపై పోలవరం అథారిటీ ఆగ్రహం

జగన్‌ ప్రభుత్వం పోలవరంలో గుత్తేదారు ఏజెన్సీని మార్చాలని తీసుకున్న నిర్ణయంపై పోలవరం అథారిటీ 2019 ఆగస్టు 13న నిర్వహించిన సమావేశం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలు ఇలా ఉన్నాయి.

  • పోలవరం హెడ్‌ వర్క్స్‌ గుత్తేదారును నిర్ణయించడానికి ఏపీ ప్రభుత్వానికి 2009 నుంచి 2013 వరకు సమయం పట్టింది. మళ్లీ గుత్తేదారును మారిస్తే అదే సమస్య రావచ్చు. పనులు వేగం అందుకోవడానికి పది నెలల సమయం పడుతుంది. అది మొత్తం ప్రాజెక్టు ఆలస్యానికి దారి తీయవచ్చు. గుత్తేదారును మార్చడం వల్ల రెండేళ్ల పాటు గుత్తేదారుకు లోపభూయిష్ట బాధ్యత, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత విధించడం సాధ్యం కాదు. ఇది ఊహించని సంక్లిష్టతలను సృష్టిస్తుంది. నిర్మాణవ్యయంలో పొదుపు సాధించినా.. ప్రాజెక్టు ఆలస్యమై ఆ ప్రయోజనాలూ ఆలస్యం కావడం వల్ల జరిగే నష్టం మరింత ఎక్కువ. గుత్తేదారులతో ఒప్పందం ముందస్తుగా రద్దు వల్ల వారికి అందించాల్సిన పరిహారం కోసం అదనపు ఖర్చు అవుతుంది.
  • ప్రాజెక్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టెండర్లు రద్దు చేసి రివర్స్‌ టెండర్లు నిర్వహించాలనే ఆలోచన మానుకోవాలని పోలవరం అథారిటీ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా జగన్‌ ప్రభుత్వం గుత్తేదారును మార్చివేసింది. మేఘా సంస్థకు పనులు అప్పజెప్పింది.
  • రివర్స్‌ టెండర్ల పేరుతో రూ.628.47 కోట్లు ఆదా చేసినట్లు తేల్చినా- ఆ తర్వాత ఈ పనుల అమలు సమయంలో కొన్ని స్పెసిఫికేషన్ల మార్పు, ఇతర పనులతో సహా మరికొన్ని అదనపు అంశాలు గుర్తించి రెండు తాజా టెండర్లు పిలిచారు. ఆ రెండు టెండర్ల పనులూ మేఘా సంస్థకే ఇచ్చారు. దీనివల్ల రివర్స్‌ ద్వారా ఆదా చేశామని చెప్పిన రూ.628.47 కోట్ల స్థానంలో రూ.2,268.68 కోట్ల అదనపు భారం పడింది.
  • ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి కారణాలపై ఐఐటీ హైదరాబాద్‌ నివేదిక ఇచ్చింది. నీతి ఆయోగ్‌ ఆదేశాలతో ఈ నివేదిక సిద్ధమయింది. గుత్తేదారును మార్చడం, తగినంత పనులు చేయకపోవడం, వ్యూహాత్మక ప్రణాళిక, సమన్వయ లోపం, తరచు డిజైన్లు మార్చడం కారణాలుగా ఆ కమిటీ తేల్చింది. 2020లో 22 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ప్రధాన డ్యాం వద్ద మూడు ప్రదేశాల్లోను, దిగువ కాఫర్‌ డ్యాంలోను విధ్వంసం సృష్టించిందని కమిటీ పేర్కొంటూ ఎగువ కాఫర్‌ డ్యాంలలో గ్యాప్‌లను సకాలంలో మూసివేయకపోవడం వల్లే ఇలా అయిందని తేల్చింది.
  • పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులన్నీ మళ్లీ అదే ప్రాజెక్టుపై వెచ్చించలేదు. అలా రూ.3,385.58 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయకుండా దారి మళ్లించారు. 2024 మే 31 నాటికి కేంద్రం నుంచి రూ.2,697 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి.
  • 2019లో 15 లక్షల క్యూసెక్కుల వరద దాటదని అంచనా వేశారు. పోలవరం అథారిటీ నిర్ణయం ప్రకారం ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు ఆ వరద లోపు మూసివేయవద్దని నిర్ణయించారు. అలా వదిలేస్తే వరద ఎంత వేగంతో వస్తుందో కూడా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాలు, వరద సూచనల ఆధారంగా ఆ సీజన్‌ వరకు ఎగువ కాఫర్‌ డ్యాం ఖాళీలు పూడ్చకూడదని నిర్ణయించారు. 2019 వరదల సీజన్‌లో 13.95 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డయాఫ్రం వాల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
  • 2020 జూన్‌ నాటికి ఎగువ కాఫర్‌ డ్యాం ఖాళీలు మూసివేయలేదు. 2020 వరద సీజన్‌లో 22 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతిని, ఇతర విధ్వంసాలు చోటుచేసుకున్నాయి.
  • తర్వాత నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ డయాఫ్రం వాల్‌ పరిస్థితిపై అధ్యయనం చేసింది. ఎక్కడెక్కడ ఎంతమేర విధ్వంసం జరిగిందో గుర్తించింది. దిగువ కాఫర్‌ డ్యాం కట్‌ ఆఫ్‌ కూడా ధ్వంసమయిందని తేల్చింది. 2020 వరదల్లో ధ్వంసమైతే 2023 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ అధ్యయనం చేసింది. డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న ప్రాంతాన్నే సరిచేయాలని, మిగిలిన భాగం సురక్షితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
  • డయాఫ్రం వాల్‌ మరమ్మతుల తర్వాత ఆ కట్టడం పనితీరుపై హామీ ఇవ్వడానికి గుత్తేదారు ఏజెన్సీలు మేఘా, బావర్‌ కంపెనీలు అంగీకరించలేదు. బావర్‌ ఇండియా లిమిటెడ్‌ నది పొడవునా కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించడం మంచిదని సూచించింది. మేఘా కంపెనీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రజలసంఘం నిర్ణయం తీసుకోవాలి.
  • 2020 జులై నుంచి 2024 జూన్‌ వరకు డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం పనులన్నీ స్తంభించిపోయాయి. మరోవైపు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో అదనపు సీపేజి ఉన్నట్లు గుర్తించినా, ఇప్పటివరకు నియంత్రించలేదు.
  • ప్రధాన డ్యాం గ్యాప్‌ 1లో చేసిన పనుల నాణ్యతపైనా అనుమానాలు ఉన్నాయి. ఆ పనులు చేపట్టేందుకు అదనపు ట్రీట్‌మెంట్‌ చర్యలు అవసరమని తేల్చారు. డిజైన్‌ ట్రీట్‌మెంట్‌ చర్యలు ఖరారు చేయకపోవడంతో ఆ పనులూ ముందుకు సాగలేదు. స్పిల్‌ వే కు ఎగువన నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. దాన్నీ ఇంకా సరిదిద్దాలి.
  • గుత్తేదారును మార్చకుండా ప్రాజెక్టు ప్రణాళిక సక్రమంగా అమలు చేస్తే 2020 ఖరీఫ్‌లో నీటి విడుదలకు వీలుగా ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆ తర్వాత ప్రాజెక్టును అసమర్థ ప్రణాళికతో 2023 జూన్‌ వరకు పొడిగించారు.
  • పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అఫ్రి ఇండియా లిమిటెడ్, అంతర్జాతీయ నిపుణుల సేవలు తీసుకోవాలని పోలవరం అథారిటీ నిర్ణయించింది. అఫ్రి ఇండియా లిమిటెడ్‌ డిజైన్లు ప్రతిపాదిస్తే పోలవరం అథారిటీ నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ల సమన్వయంతో ఆమోదించాలి. పోలవరంలో మిగిలిన అన్ని పనులూ నాలుగేళ్లలో పూర్తిచేసే అవకాశం ఉంది. +41.15 మీటర్ల స్థాయికి పునరావాస పనులను 2026 నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది.
  • +41.15 మీటర్ల స్థాయికి 115.43 టీఎంసీల నీటిని నింపి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని సరఫరా చేసేందుకు అన్ని పనులనూ 2028 జూన్‌ నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది. +45.72 మీటర్ల స్థాయికి నీటిని నింపి ఆ స్థాయి పునరావాసం పనులు దశలవారీగా చేస్తాం. ప్రాజెక్టు తొలిదశలోని మిగిలిన పనులు పూర్తిచేసేందుకు అయ్యే వ్యయం రూ.12,157 కోట్లు.

పేలవమైన ప్రణాళికతో భారీ నష్టం

  • ఎగువ కాఫర్‌ డ్యాంలోని ఖాళీలను తగిన సమయంలో పూర్తిచేయలేదు. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయితే ముంపులో చిక్కుకునే గ్రామాలకు పునరావాసం కల్పించలేదు. స్పిల్‌ వేకు అప్రోచ్‌ ఛానల్, కుడి, ఎడమ హెడ్‌ రెగ్యులేటర్లకు అప్రోచ్‌ ఛానల్‌ పురోగతి పేలవం. ఫలితంగా ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్, కట్‌ ఆఫ్‌ వాల్‌కు తీవ్ర నష్టం. దిగువ కాఫర్‌ డ్యాం దెబ్బతింది. ప్రధాన ఆనకట్ట నిర్మించాల్సిన చోట అగాధాలు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులు అధిగమించేందుకు అవసరమైన చర్యలూ ఖరారు కాలేదు. ఫలితంగా ప్రధాన ఆనకట్టల పని ఏదీ ప్రారంభం కాలేదు.
  • కీలకమైన పని సమయంలో అకస్మాత్తుగా గుత్తేదారును మార్చారు. కేంద్రప్రభుత్వం, కేంద్ర జల్‌శక్తి, పోలవరం అథారిటీ సూచనలను విస్మరించారు. కొత్త ఏజెన్సీ సిబ్బంది, యంత్రాల సమీకరణలో జాప్యం చేయడంతో ఈ తీవ్ర నష్టాలన్నీ సంభవించాయి.

అప్పుడు పురోగతి.. జగన్‌ పాలనలో తిరోగమనం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో మంచి పురోగతితో స్వర్ణయుగమైతే, 2019-24 మధ్య జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరోగమనంలో నడిచింది. దానికి ఈ లెక్కలే నిదర్శనం. పనులు జరగకపోగా ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అనిశ్చితిలో పడింది. రెండు ప్రభుత్వాల హయాంలో పనులు జరిగిన తీరు...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని