Chandrababu: నిరుపేద ఇంటికి చంద్రన్న ‘భరోసా’

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్‌ పాములు నాయక్‌ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు.

Published : 02 Jul 2024 06:24 IST

పింఛను లబ్ధిదారుడు పాములు నాయక్‌ ఇంటికి సీఎం చంద్రబాబు
స్థితిగతులు చూసి ఇల్లు మంజూరు
20 నిమిషాలకు పైగా పూరిగుడిసెలోనే సీఎం

పెనుమాకలో బాణావత్‌ పాములునాయక్, ఆయన భార్య సీతకు పింఛను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఈనాడు-అమరావతి, తాడేపల్లి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్‌ పాములు నాయక్‌ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు. తొలుత పాములునాయక్‌కు వృద్ధాప్య పింఛను రూ.7 వేలు ఇచ్చి..ఆయన భార్య సీతకు సీఆర్‌డీఏ పింఛను రూ.5 వేలు, కూతురు సాయికి వితంతు పింఛను రూ.7 వేలు అందించారు. 20 నిమిషాలకు పైగా ఆ పూరి గుడిసెలోనే వారి మంచంపై కూర్చున్న ఆయన.. అక్కడే టీ తాగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పింఛను ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయం పెంచేందుకు ఆలోచనలు చేస్తున్నామని చంద్రబాబు వారికి చెప్పారు. పేదల ఆదాయాన్ని పెంచి.. ఖర్చులు తగ్గించి జీవితాలు బాగుపడేలా వినూత్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా పిల్లలను చదివిస్తున్న తీరును చంద్రబాబు అభినందించారు. ఇప్పుడు చెప్పించే చదువే బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆ కుటుంబ స్థితిగతులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేస్తూ పత్రాలను అందించారు. పింఛన్‌ ఇవ్వడంతోపాటు మీకు ఇల్లు లేనందున ఇల్లు కూడా మంజూరు చేస్తున్నాను. అని ఆయన చెప్పగానే ఇల్లు తాము కట్టుకోలేమని కట్టించి ఇవ్వాలని వారు కోరడంతో కలెక్టర్‌కు ఆ బాధ్యత అప్పగించారు. ‘ఇంట్లో ఇక నుంచి ప్రతి నెలా ముగ్గురికీ కలిపి రూ.13 వేలు పింఛను వస్తుంది. దానికి తోడుగా మీరు కొంత సంపాదించుకుని పిల్లలను చదివించుకుంటే ప్రభుత్వ పరంగా సాయం అందుతుంది’ అని ఆయన వివరించారు. పేదరికంలో పుట్టి పేదరికంలో మగ్గితే ఎలా అని చంద్రబాబు అనగానే వితంతు సాయి మాట్లాడుతూ పొలాలు చేసి నష్టపోయామని, అప్పుల వల్ల ఇల్లు కట్టుకోలేకపోయామని వివరించారు. . ‘మీ అబ్బాయి కానిస్టేబుల్‌ అవుతానంటున్నాడు. మరో కుమారుడు లాయర్‌ కావాలనుకుంటున్నాడు. ఇప్పటి నుంచి బాగా చదువుకుంటే ఐదు, పదేళ్లలో ఉద్యోగాలు వచ్చి వారు జీవితంలో స్థిరపడతారు.  మీరు ప్రతినెలా ఆసుపత్రికి రూ.5 వేలు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడే ఉన్న ఎయిమ్స్‌కు వెళితే అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారు. ఇలా వినూత్నంగా ఆలోచించాలి’ అని సూచిస్తూ వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. ‘మీ ఇంటి పక్కనే చాలా మంది పెద్ద ఇళ్లు కట్టుకున్నారు. వాళ్లు కూడా చిన్నతనంలో మీలాగానే ఉన్నా కొంచెం ముందుకు వెళుతున్నారు. మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు బాగున్నారు కదా? మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. వాళ్ల పూర్వీకులు ఎకరం, రెండెకరాలు పొలం ఇస్తే కష్టపడి పనిచేసి దానిని పెంచుకున్నారు. మీకు భూమి లేనందున కష్టార్జితంతో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరికీ కనీస ఆదాయం సంపాదించే మార్గం చూపాలనేది నా ఆలోచన. లేకపోతే ఇలాగే పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతారు. పిల్లలను చదివించి మంచి పనిచేస్తున్నారు. ఇది శుభ సూచికం. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది’ అని చంద్రబాబు వారితో అన్నారు. బాగా చదువుకుంటున్నారా? మంచి ర్యాంకు వస్తుందా? మార్కులు ఎన్ని వచ్చాయని పిల్లలను అడిగారు.

బాణావత్‌ పాములునాయక్‌ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 

ఆ కుటుంబాన్ని చూసి బాధేసింది

ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘పాములు నాయక్‌ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా బాధ కలిగింది. చుట్టుపక్కల అన్నీ మంచి ఇళ్లు ఉన్నాయి. వీరు పూరి గుడిసెలో ఉంటున్నారు. అది కూడా కురుస్తోంది. పొలం కౌలుకు తీసుకుని ఉల్లిపంట వేస్తే కలిసి రాక రూ.9 లక్షలు నష్టపోయారు. ఆ సొమ్ము ఇప్పుడు చెల్లించాల్సి వస్తోంది. కూతురికి భర్త చనిపోవడంతో వారు కూడా ఇక్కడే ఉంటున్నారు. రూ.1.8 లక్షలతో ఇల్లు మంజూరు చేస్తామని చెబితే ఇల్లు కట్టుకోలేమని వారు అన్నారు. కట్టించి ఇస్తామని హామీ ఇచ్చా. 3.8 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇలాంటి పేదవారిని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ రోజు శాశ్వతంగా నా జీవితంలో గుర్తుంటుంది’ అని చంద్రబాబు వివరించారు.

పింఛను లబ్ధిదారు ఇచ్చిన టీ తాగుతున్న చంద్రబాబునాయుడు

పెనుమాక వీధుల్లో ఇంటింటికీ వెళ్లి వృద్ధురాలిని, గ్రామస్థులను పలకరిస్తున్న సీఎం చంద్రబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని