Chandrababu: ప్రజా వేదిక శిథిలాలు అక్కడే

గతంలో జగన్‌ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.

Published : 05 Jul 2024 04:49 IST

రాష్ట్ర నిర్మాణానికి పునరంకితమయ్యేలా ప్రజల్లో ఉత్తేజం నింపేందుకే

ఈనాడు, అమరావతి: గతంలో జగన్‌ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రం మళ్లీ జగన్‌ వంటి విధ్వంసకర పాలకుల చేతుల్లోకి వెళితే ఎలాంటి నష్టం జరుగుతుందో భావితరాలకు గుర్తుండేలా ఆ శిథిలాల్ని అలాగే ఉంచాలన్నది ఆలోచన. ప్రజలు వాటిని చూసి... రాజధాని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉత్తేజితులు కావాలన్నది చంద్రబాబు అభిమతం. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి పక్కనే అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రజావేదికను నిర్మించింది. కలెక్టర్ల సదస్సులు వంటి అధికారిక సమావేశాల నిర్వహణకు, ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతులు స్వీకరించేందుకు... ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడేది. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక రాజధాని విధ్వంసాన్ని ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలు పెట్టారు. తొలి కలెక్టర్ల సదస్సును దానిలో నిర్వహించి, ఆ మర్నాడే కూల్చేశారు. చంద్రబాబుపై ద్వేషంతో ఆ శిథిలాల్ని ఐదేళ్లపాటు అక్కడే ఉంచారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాజధాని అమరావతి పర్యటనకు వెళ్లేటప్పుడు మొదట ప్రజావేదికనే పరిశీలించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు తాకిడికి విధ్వంసమైన ప్రాంతాల్ని అక్కడి ప్రభుత్వం అలాగే ఉంచిందని, ప్రజలు  కసిగా పనిచేయడంతో ఆ దేశం అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఎదిగిందని, ఆ స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలూ అందిపుచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేసినప్పుడూ ప్రజావేదిక శిథిలాల్ని అలాగే ఉంచాలన్న ప్రతిపాదన వస్తే... దాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రజావేదిక వంటి సమావేశ మందిరాన్ని రాజధానిలో మరో చోట రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని