AP news: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయంలో సీఐ దురుసు ప్రవర్తన

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు.

Updated : 27 Jun 2024 07:20 IST

బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు. పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సీఐ ప్రయత్నించారు. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు. కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సీఐకి సూచించారు. సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లారు. బూట్లతోనే లోపలికి వెళ్లవద్దని సిబ్బంది కోరినా పట్టించుకోలేదు. సీఐ దురుసు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో బుధవారం సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్‌కుమార్‌ను నియమిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. సీఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్టుమెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరిట హడావుడి చేశారు. అప్పట్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని