Chandra babu: ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా?

‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు.

Published : 29 Jun 2024 06:13 IST

రాజకీయ నాయకుల భద్రతపై సమీక్షిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు. రాజకీయ నేరస్థులకూ సెక్యూరిటీ ఉంది. వీటన్నింటినీ సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పాను. అది ఎలా అమలుచేస్తున్నారో కూడా గమనిస్తున్నాను. మంత్రులకూ చెప్పాను. మేమేమీ రాజులం, నియంతలం కాదు’ అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పోలవరం విధ్వంసంలో గుత్తేదారు బాధ్యత ఎంత? మారుస్తారా? అని ప్రశ్నిస్తే పాత రోజుల నుంచి జరిగిన పరిణామాలను వివరించారు. ‘‘ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నవయుగకు పనులు అప్పజెప్పినప్పుడూ కేంద్రం అనుమతితో అవే పాత ధరలకు పనులు ఇచ్చాం. గుత్తేదారును మార్చవద్దని కేంద్రం చెబితే జగన్‌ వినకుండా ఇష్టారాజ్యంగా చేశారు’’ అన్నారు. ప్రస్తుత గుత్తేదారు మేఘా కంపెనీ రెండేళ్లలో పూర్తిచేస్తామని ఒప్పందం చేసుకున్నారు.. పూర్తి చేయలేదు కదా అని ప్రశ్నిస్తే ఒప్పందంలో కొన్ని కండిషన్లు ఉంటాయని, వాళ్లకి సైట్‌ అప్పచెప్పడం, ఇతర అంశాలు వారు ప్రస్తావిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • 2021లో జగన్‌ మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అప్పటికే మునిగిపోయింది. ఇలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రిగా పెట్టుకోవడం మన దురదృష్టం. పోలవరంలో నష్టాలకు బాధ్యులను తేల్చడం ముఖ్యం. పోలవరంలో ప్రధాన దోషి జగన్‌ను ప్రజలు ఇంటికి పంపారు. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉంటారా, ముఖ్యమంత్రికి అర్హుడా అన్న చర్చ జరిగింది. అందుకే 11 సీట్లు వచ్చాయి. ఆ తీర్పుతో అంతా అయిపోలేదు. ఆయన చేసిన పనులు ఘోరాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయి. ఆ శాపం ఎన్నాళ్లు వెంటాడుతుంది... పదేళ్లా, 30 ఏళ్లా అన్నది కాలమే చెప్పాలి. పోలవరంలో ఉన్న అధికారుల్లో కొంతమందిని మార్చాం. ఇంకా ఎంతమందిని మార్చాలి? ఎవరెవరిని మార్చాలి? మారిస్తే ఎవరిని నియమించాలి ఇవన్నీ చర్చలే. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై అదనపు భారం పడుతుంది. ఒక వ్యక్తి చేసిన నష్టానికి కేంద్రప్రభుత్వం కూడా పరిహారం కట్టి ఇవ్వాలి. ప్రాజెక్టు ఆలస్యం వల్ల పునరావాసం అంచనాలు పెరుగుతాయి. పోలవరం ఎత్తు విషయంలో రాజీ లేదు. 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మిస్తాం.
  • నివేదిక ఇచ్చేందుకు అంతర్జాతీయ నిపుణులకు డిసెంబరు వరకు సమయం ఇచ్చారు. వారు అప్పటికి నివేదిక ఇస్తారో, ఇంకా సమయం తీసుకుంటారో చూడాలి. మే నుంచి నవంబరు వరకు పనులు చేయలేం. ఒకవేళ నివేదిక ఆలస్యమైతే ఏడాది అంతా కోల్పోయినట్లే. ఏం జరుగుతుందో చూడాలి. ముందు సవాళ్లు పరిష్కారం కావాలి. నిపుణులు వచ్చి అంతా తేల్చాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని