Indian Railway: కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో 78 రైళ్ల రద్దు.. 26 ఎక్స్‌ప్రెస్‌ల దారి మళ్లింపు

దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.

Updated : 26 Jun 2024 07:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఆసిఫాబాద్‌-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నారు. వాటి వివరాలను ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కనిష్ఠంగా ఒక రోజు నుంచి గరిష్ఠంగా 11 రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నాయి.

రద్దయిన రైళ్లు ఇవే..

సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (నం.12757/12758) జూన్‌ 26 నుంచి జులై 6 వరకు రద్దయ్యాయి. పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (నం.22151) ఈ నెల 28, జులై 5న.. కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్‌ (నం.22152) జూన్‌ 30, జులై 7న.. హైదరాబాద్‌-గోరఖ్‌పుర్‌ (నం.02575) జూన్‌ 28న, గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌ (నం.02576) ఎక్స్‌ప్రెస్‌ జులై 30న రద్దయ్యాయి.

  •   ముజఫర్‌పుర్‌-సికింద్రాబాద్‌ (నం.05293) జులై 2న, సికింద్రాబాద్‌-ముజఫర్‌పుర్‌ (నం.05294) జూన్‌ 27, జులై 4న.. గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303) రైలు జూన్‌ 29న, జడ్చర్ల-గోరఖ్‌పుర్‌ (నం.05304) రైళ్లు జులై 1న రద్దయ్యాయి.   
  • సికింద్రాబాద్‌-రాక్సల్‌ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్‌ 26, 27, 28 తేదీల్లో.. సికింద్రాబాద్‌-దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో..  సికింద్రాబాద్‌-సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే రైళ్లు జూన్‌ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.

దారి మళ్లింపు..

తెలంగాణ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను నిర్ణీత తేదీల్లో దారి మళ్లించి నడిపించాలని ద.మ.రైల్వే నిర్ణయించింది. కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్‌-న్యూదిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్‌ మీదుగా మళ్లించనున్నారు. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు. న్యూదిల్లీ-సికింద్రాబాద్‌ (నం.12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపిస్తారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు. సికింద్రాబాద్‌-నిజాముద్దీన్‌ (దిల్లీ), నిజాముద్దీన్‌-సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని