వైజాగ్‌ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేయండి: కేంద్రమంత్రికి ఏపీ భాజపా ఎంపీల వినతి

విశాఖ ఉక్కును స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)లో విలీనం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు.

Updated : 27 Jun 2024 07:34 IST

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చర్చిస్తున్న భాజపా ఎంపీలు పురందేశ్వరి, సీఎం రమేష్‌. చిత్రంలో సహాయ మంత్రి శ్రీనివాసవర్మ 

ఈనాడు, దిల్లీ: విశాఖ ఉక్కును స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)లో విలీనం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు. ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ‘‘ఉక్కు పరిశ్రమను శక్తిమంతమైన కేంద్రంగా తయారు చేయడంతోపాటు, భారత్‌కు కలికితురాయిగా మార్చడానికి విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌తోపాటు, ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌నూ సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతున్నాం. ఈ విలీనం వల్ల 2017 జాతీయ ఉక్కు విధానంలోని లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంతోపాటు, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సమీకృతం చేయడానికి దోహదపడుతుంది. లాభాలు పెరిగి సెయిల్‌ మార్కెట్‌ విస్తృతం అవుతుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వేగంగా లాభాల్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ వ్యూహాత్మక చర్యతో భారత ఉక్కు పరిశ్రమకు ప్రయోజనం. అందువల్ల సానుకూల నిర్ణయం తీసుకోండి’’ అని వినతిపత్రంలో కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు పురందేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులతో కూలంకషంగా చర్చించిన తర్వాత రెండు నెలల్లో మరోసారి కలిసి మాట్లాడుతానని కుమారస్వామి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథరాజు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు