Atchutapuram: అచ్యుతాపురం సెజ్‌లో కృతిమ మేధ పరిశ్రమ

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో తొలిసారి కృత్రిమ మేధ కంపెనీ అడుగుపెట్టబోతోంది. సబ్‌స్ట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చర్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ (స్మైల్‌) పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది.

Updated : 03 Jul 2024 09:14 IST

రూ.189 కోట్ల పెట్టుబడితో వస్తున్న ఏఐ కంపెనీ
5వేల మందికి ఉపాధి లక్ష్యం

అచ్యుతాపురం సెజ్‌ 

ఈనాడు - అనకాపల్లి, న్యూస్‌టుడే- అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో తొలిసారి కృత్రిమ మేధ కంపెనీ అడుగుపెట్టబోతోంది. సబ్‌స్ట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చర్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ (స్మైల్‌) పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇక్కడ ఏఐ ఉత్పత్తులను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సెజ్‌లో ప్రస్తుతం 208 పరిశ్రమలున్నాయి. వాటిలో ఎక్కువ భాగం తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఏషియన్‌ పెయింట్స్, సెయింట్ గొబైన్‌ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. ఫార్మా, టెక్స్‌టైల్‌ అపరెల్‌ పార్క్, ఫెర్రో, టైర్లు, రంగులు, అద్దాల పరిశ్రమలతో సెజ్‌ కళకళలాడుతోంది. చండీగఢ్‌ కేంద్రంగా నమోదైన స్మైల్‌ సంస్థ రూ.189 కోట్ల పెట్టుబడితో ఏఐ పరికరాలను తయారుచేసే కంపెనీని ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా 2028లోపు దశల వారీగా 5వేల మందికి ఉపాధి అవకాశాలను చూపిస్తామని కంపెనీ ప్రతినిధులు ఏపీఐఐసీకి ఇచ్చిన సవివర నివేదిక (డీపీఆర్‌)లో పేర్కొన్నారు. అది కూడా స్థానిక యువతకే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏటా ఇంజినీరింగ్, డిప్లొమా చేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న వేల మంది విద్యార్థులకు ఈ ఏఐ కంపెనీలో ఉపాధి దక్కే అవకాశం ఉందని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. గతేడాది చివర్లో భూకేటాయింపునకు సంబంధించి ఏపీఐఐసీ అధికారులకు కంపెనీ ప్రతిపాదనలు పంపించగా పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది. సెజ్‌లో 20 ఎకరాలను 33 ఏళ్లకు లీజుకు కేటాయించారు. ‘స్మైల్‌ పేరుతో ఏఐ సాంకేతిక పరిశ్రమ అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికి టాప్‌ మెటలర్జికల్‌ కంపెనీకి సమీపంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. త్వరలోనే ఈ కంపెనీ నిర్మాణ పనులు పట్టాలెక్కనున్నాయి’ అని అచ్యుతాపురం ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ కె.హరిప్రసాదరావు చెప్పారు.


స్థానికంగా ఉపాధి దక్కితే చాలు

సెజ్‌లో ఏఐ సాంకేతిక ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు తయారుచేసే పరిశ్రమ వస్తుందని తెలిసింది. స్థానికంగా ఇంజినీరింగ్‌ చదివిన యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇలాంటి కంపెనీలు వస్తే మాలాంటి వారు విశాఖకు కూడా వెళ్లనవసరం లేకుండా ఇక్కడే ఉపాధిని పొందవచ్చు. 

పావని, నిరుద్యోగ యువతి, పూడిమడక


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని