Gautam Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌ పదవికి గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు బుధవారం తన రాజీనామా లేఖను అందజేయగా ఆయన దానిని ఆమోదించారు.

Published : 04 Jul 2024 04:59 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌ పదవికి గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు బుధవారం తన రాజీనామా లేఖను అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. మరోవైపు గత రెండు, మూడురోజుల నుంచి కమిషన్‌ కార్యాలయంలో పదోన్నతుల సందడి నెలకొంది. గౌతమ్‌ సవాంగ్‌ క్లియరెన్స్‌ ఇవ్వడంతో కమిషన్‌లో పనిచేసే ఉద్యోగులకు సుదీర్ఘకాలం నుంచి పెండింగులో ఉన్న పదోన్నతులు లభించాయి. గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా ప్రకటన కూడా బుధవారమే వెలువడింది. 

డీజీపీగా విమర్శలపాలైన అధికారి 

వైకాపా ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నప్పుడు గౌతమ్‌ సవాంగ్‌ వ్యవహారశైలి పలుమార్లు విమర్శల పాలైంది. ఆయన హయాంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపైనా కేసులు పెట్టారు. అదే సమయంలో 2022 ఫిబ్రవరిలో విజయవాడలో ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం అదే నెల మూడో వారంలో డీజీపీ హోదా నుంచి సవాంగ్‌ను తప్పించి ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. 2025 జులై 9 వరకు ఈ పదవిలో గౌతమ్‌ సవాంగ్‌ కొనసాగాల్సి ఉంది. ఆయన హయాంలోనే 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం రెండోసారి జరిగిందన్న దానిపై పెద్ద దుమారం రేగింది. దీనిపై న్యాయస్థానంలో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. గౌతమ్‌ సవాంగ్‌ కమిషన్‌లో ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలూ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని