Andhra News: కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు

కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది.

Updated : 04 Jul 2024 13:55 IST

బుధవారం రాత్రి ఘటన
పీసీబీ, గనులు, ఏపీఎండీసీలకు చెందినవిగా అనుమానం

పెదపులిపాక వద్ద తగలబడుతున్న దస్త్రాలు

పెనమలూరు, న్యూస్‌టుడే: కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్యనియంత్రణ మండలికి చెందిన హార్డ్‌డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు చెందిన దస్త్రాలు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సగం కాలిన ఓ దస్త్రంపై మాజీ మంత్రి పెద్డిరెడ్డి చిత్రం

ఇన్నోవాలో వచ్చి.. బస్తాలు దించి..

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ16 ఈఎఫ్‌ 2596 నంబరు గల ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్ట పైకి వచ్చారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్‌ ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద కారు నిలిపి, అందులో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న ఓ తెదేపా కార్యకర్త దీన్ని గమనించారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్‌ సమీర్‌శర్మ చిత్రాలు ఉండడంతో ఆయన వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తెదేపా నేతలకు సమాచారం అందించారు. దీంతో పెదపులిపాక తెదేపా నేతలు, కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకొన్నారు. ఇది గమనించిన ఇన్నోవాలోని వ్యక్తులు యనమలకుదురు వైపు పరారయ్యారు. యనమలకుదురులో తెదేపా నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ వచ్చి కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. సమీర్‌శర్మ సూచనతో దస్త్రాలు తీసుకొచ్చి తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్‌ నాగరాజు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని