Andhra News: అప్పుల కుప్ప.. బకాయిల కొండ!

ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి పొందిన రూ.2,500 కోట్లను ఇతర అవసరాలకు వాడుకుంది. ఆసుపత్రుల్లో రోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.

Updated : 30 Jun 2024 10:05 IST

ఇదీ జగన్‌ ప్రభుత్వ నిర్వాకం
ప్రపంచ బ్యాంకు నిధులనూ వదలని వైనం
ఆసుపత్రుల అభివృద్ధి పేరుతో రూ.2,500 కోట్ల రుణం.. దారి మళ్లింపు..

ఈనాడు, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి పొందిన రూ.2,500 కోట్లను ఇతర అవసరాలకు వాడుకుంది. ఆసుపత్రుల్లో రోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ప్రపంచ బ్యాంకుతో కుదిరిన ఒప్పంద కాలం త్వరలో ముగియబోతుంది. పునరుద్ధరణ సమయంలో కొత్త ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు నిధులు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. వైకాపా పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మొత్తంగా రూ.4వేల కోట్ల  భారాన్ని మోపింది. కేంద్రం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖకు రావాల్సిన సుమారు రూ.1,500 కోట్లను సైతం వైకాపా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇందులో 15వ ఆర్థిక సంఘానికి చెందిన సుమారు రూ.500 కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ నుంచి అనుబంధ ఆసుపత్రులకు రూ.1,500 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు రూ.1,000 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి. 

ప్రపంచ బ్యాంకు నుంచి అందే రుణాన్ని పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవడం లేదా రుణం మొత్తంలో కొంత మొత్తాన్ని వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించడం లేదా పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖకు కానీ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి అందే రుణాన్ని పూర్తిగా తాను మాత్రమే తీసుకునేలా జాగ్రత్తపడింది. దీనివల్ల ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన రుణం వల్ల వైద్య ఆరోగ్య శాఖకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. వైకాపా పాలనలో స్ట్రెచర్ల వంటి సదుపాయాలు కూడా రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అవసరాలకు సరిపడా 4వ తరగతి ఉద్యోగులు లేరు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ క్వాలిటీ ఎష్యూరెన్స్‌ స్టాండర్డ్, లక్ష్య, ముస్కాన్‌ విభాగాల కింద ఎంపికై సర్టిఫికేషన్‌లు పొందిన ఆసుపత్రులకు చెల్లింపులు వైకాపా పాలనలో సక్రమంగా జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు