AP High Court: కల్కి సినిమా టికెట్‌ ధర పెంపుపై హైకోర్టులో పిల్‌

కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్‌) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది.

Updated : 04 Jul 2024 06:05 IST

ఈనాడు, అమరావతి: కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్‌) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ తదితరులకు నోటీసులిచ్చింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కల్కి సినిమా టికెట్ల ధరను పెంచుకునేందుకు అవకాశమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ పి.రాకేశ్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. న్యాయవాది గుండాల శివప్రసాదరెడ్డి వాదనలు వినిపించారు. పది రోజులపాటు టికెట్ల ధర పెంచుకునేందుకు మొదట అనుమతిచ్చారని, తర్వాత మరో నాలుగు రోజులు పెంచారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ నాలుగు రోజులు అధిక ధరకు విక్రయించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. నిర్మాతల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ఓ సినిమా వ్యవహారంగా కాకుండా.. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాజ్యాన్ని విచారణ చేద్దామని పేర్కొంటూ వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని