AP Pensions: నేడే పింఛన్ల పండగ

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది.

Published : 01 Jul 2024 05:33 IST

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7,000 చొప్పున అందజేత
దివ్యాంగులకు రూ.3,000 నుంచి రూ.6,000కు పెంపు 
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ 
తొలి రోజే 100 శాతం పూర్తయ్యేలా కార్యాచరణ  
పెనుమాకలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి అందించనున్న సీఎం చంద్రబాబు  
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించేలా తొలి అడుగు  
65.18 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,408 కోట్ల విడుదల
ఈనాడు - అమరావతి 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారులకు అందించేందుకు నగదు లెక్కిస్తున్న సచివాలయ సిబ్బంది

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. తద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాలకు చెందిన వారి మోముల్లో చిరునవ్వులు పూయించనుంది. నూతన ప్రభుత్వం చేపట్టే తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. రూ.7,000 చొప్పున పింఛను అందజేయడమనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించనున్న పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు  పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా ఆయనే పింఛన్లను అందించనున్నారు. ప్రజల వద్దకే పాలన దిశగా తొలి అడుగు వేయనున్నారు. మిగతాచోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను ఇస్తారు. అవసరమైన చోట్ల ఇతర శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. నగదుతోపాటు చంద్రబాబు రాసిన లేఖను లబ్ధిదారులకు అందిస్తారు. 

ఒకేసారి రూ.1,000 పెంపు 

సామాజిక భద్రత పింఛనుదారులకు తొలి నుంచీ తెదేపా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వీరికి 2014-19 మధ్య రెండుసార్లు పింఛను మొత్తాన్ని పెంచింది. 2014లో అధికారం చేపట్టగానే రూ.200 నుంచి రూ.1,000కి ఒకేసారి ఐదు రెట్లు పెంచింది. తర్వాత మరో విడత రూ.1,000 నుంచి రూ.2,000లు చేసింది. వైకాపా ప్రభుత్వం 2019-24 మధ్య ఏడాదికి రూ.250 చొప్పున నాలుగు విడతల్లో రూ.1,000 పెంచింది. ప్రస్తుతం పింఛనుదారులకు రూ. 3,000 చొప్పున అందుతుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి రూ. 1,000 పెంచి రూ. 4,000 చేశారు. దీంతోపాటు ఏప్రిల్‌ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ. 1,000 చొప్పున కలిపి రూ. 7,000 సోమవారం పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులకు, కుష్ఠు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి రూ. 3,000 పెంచి రూ. 6,000 అందించనున్నారు. 


పక్షవాతం, తీవ్ర కండరాల లోపం ఉన్న వారికి రూ.5,000 నుంచి రూ.15,000 

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు తదితర 11 విభాగాలకు చెందిన వారికి ప్రస్తుతం ప్రతినెలా అందుతున్న రూ. 3,000 పింఛన్‌ను నూతన ప్రభుత్వం రూ. 4,000కు పెంచింది. దివ్యాంగులకు ఎన్నడూ లేనివిధంగా భరోసా కల్పించింది. ప్రస్తుతం వారికి అందుతున్న రూ. 3,000ను ఒకేసారి రూ. 6,000 చేసింది. పక్షవాతం, తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి, ప్రమాద బాధితులకు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి అందుతున్న రూ. 5,000 మొత్తాన్ని రూ. 15,000కు పెంచింది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఇస్తున్న రూ. 5,000ను రూ. 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  


ఉదయం 6 గంటల నుంచే ప్రారంభం 

పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తిచేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛనుదారులను కేటాయించారు. అంతకుమించి ఉంటే కొన్నిచోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛను అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని