Amaravati: అమరావతి అనుసంధాన రహదారుల అభివృద్ధి

రాజధాని అమరావతికి అనుసంధాన రహదారి అభివృద్ధి, కరకట్ట రోడ్డు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే విశాలమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు.

Updated : 03 Jul 2024 05:53 IST

మిగిలిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణంపై కసరత్తు
భూసేకరణకు రైతులతో సంప్రదింపులు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి అనుసంధాన రహదారి అభివృద్ధి, కరకట్ట రోడ్డు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే విశాలమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఆయన హయాంలో పనులు శరవేగంగా సాగినా, 2019లో వైకాపా అధికారంలోకొచ్చాక ఆగిపోయాయి. ఐదేళ్ల తర్వాత తిరిగి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు రాజధాని పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు.అమరావతిలో సువిశాలమైన రహదారులు నిర్మించి, చెన్నై- కోల్‌కతా హైవేతో అనుసంధానించాలన్న ఆలోచనతో గతంలో సీఎం చంద్రబాబు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు (ఈ3) నిర్మాణాన్ని రూ.242.30 కోట్లతో చేపట్టారు. దీని పొడవు 21.37 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టును ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. మొదటి దశలో 14.47 కి.మీ. పొడవున నిర్మించాల్సి ఉంది. దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు పనులు చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి 86 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మూడు చోట్ల భూమి సేకరించాల్సి ఉంది. రాయపూడి పెట్రోల్‌ బంకు పక్కన చర్చి అడ్డుగా ఉంది. దొండపాడు ప్రాంతంలో హెచ్‌టీ లైన్లను మార్చాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి రైతులు భూములివ్వకుండా అప్పటి మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెర వెనుక మంత్రాంగం నడిపారు. కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. అమరావతిపై వైకాపా ప్రభుత్వ అక్కసు కారణంగా భూసేకరణలో అడ్డంకులు తొలగకపోగా, ఏ ఒక్క పనీ అంగుళమైనా ముందుకు కదల్లేదు.

భూసేకరణకు సిద్ధం 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణాన్ని ప్రాధాన్యక్రమంలో చేపట్టాలని నిర్ణయించింది. ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు 3.80 కి.మీ. రోడ్డును ఆరు వరుసలుగా, మధ్యలో ప్రజా రవాణా కోసం బీఆర్టీఎస్‌ (బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం) ఉండేలా ప్రణాళిక రూపొందించింది. ఈ రోడ్డు కోసం 36 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. మూడో దశలో ఉండవల్లి నుంచి మణిపాల్‌ ఆసుపత్రి వరకు 3.10 కి.మీ. పొడవున 6 వరుసల పైవంతెన నిర్మించనున్నారు. దీని నమూనాలు రూపొందించినా,  అంచనాలు సిద్ధం కాలేదు. 

4 వరుసలుగా కరకట్ట విస్తరణ 

కృష్ణా నది కుడి కట్ట విస్తరణ పనులకు 2021 జూన్‌లో నాటి ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ.150 కోట్లతో 15.525 కి.మీ. పొడవున రెండు వరుసలుగా విస్తరించాలన్నది ప్రణాళిక. ఈ ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్‌ సంస్థకు అప్పగించారు. ఈ పనులు సాగాలంటే 31 మంది రైతుల నుంచి 1.18 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. పైగా 15 మంది రైతులు కోర్టుకెళ్లారు. ప్రస్తుత ప్రభుత్వం భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా కరకట్ట రోడ్డును 2 వరుసలకు బదులు 4 లేన్లుగా వెడల్పు చేసే యోచనలో ఉంది. దీని వెంబడి వాణిజ్య ప్రాంతం అభివృద్ధి చెందొచ్చని అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని