AP TET: నేడు ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

Published : 01 Jul 2024 07:36 IST

4 నుంచి దరఖాస్తుల స్వీకరణ 
వారంలో మెగా డీఎస్సీ 

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం అందుబాటులో ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్‌ నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మెగా డీఎస్సీకి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్‌కు డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 


వైకాపా ‘ఎన్నికల డీఎస్సీ’ రద్దు 

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో విడుదల చేసిన ప్రకటనని రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జీఓ నం.256ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇవ్వనున్న నేపథ్యంలో అరకొర పోస్టులతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్‌ను ప్రస్తుతం రద్దు చేసింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని